Mallareddy: పాలు, పూలు అమ్ముడే కాదు.. మల్లారెడ్డి భూ కబ్జాలూ చేస్తుండు
ABN , Publish Date - May 23 , 2024 | 04:22 AM
‘మాజీ మంత్రి మల్లారెడ్డి పాలు, పూలు అమ్ముడే కాదు.. భూ కబ్జాలు కూడా చేస్తుండు. ఆయన పేరే భూ కబ్జాల మల్లారెడ్డి. ఆయన కబ్జా చేసిన మా భూమిని మాకు ఇప్పించాలి. మల్లారెడ్డి తన తప్పు ఒప్పుకుని మాకు క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలి’ అని బాధితుడు సేరి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆయన పేరే కబ్జాల మల్లారెడ్డి.. మా భూమి మాకు ఇప్పించండి
మీడియా ఎదుట మాజీ మంత్రి బాధితుడి డిమాండ్
పంజాగుట్ట, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘మాజీ మంత్రి మల్లారెడ్డి పాలు, పూలు అమ్ముడే కాదు.. భూ కబ్జాలు కూడా చేస్తుండు. ఆయన పేరే భూ కబ్జాల మల్లారెడ్డి. ఆయన కబ్జా చేసిన మా భూమిని మాకు ఇప్పించాలి. మల్లారెడ్డి తన తప్పు ఒప్పుకుని మాకు క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలి’ అని బాధితుడు సేరి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సుచిత్ర చౌరస్తాలోని స్థల యజమాని అయిన సేరి శ్రీనివాస్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచే మా భూమిపై మల్లారెడ్డి కన్ను పడింది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా స్థలాన్ని కబ్జా చేశాడు. పోలీసుల సమక్షంలోనే మమ్మల్ని బండబూతులు తిడుతూ భయభ్రాంతులకు గురిచేశాడు. మమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు. మాకు రక్షణ కల్పించాలి’ అని డిమాండ్ చేశారు.
కుత్బుల్లాపూర్ మండలం సుచిత్ర చౌరస్తా ప్రాంతంలో జీడిమెట్లలోని సర్వే నం. 82,83లలో 33 గుంటల భూమిని తాను మహమ్మద్ బషీర్, రాకేష్ తదితరుల నుంచి కొనుగోలు చేశానని, 2012 నుంచే స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. ఈ భూమి పక్కనే ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి మర్రి లక్ష్మారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులకు 1.29 ఎకరాల భూమి ఉందని, 2016లో మల్లారెడ్డి బీఆర్‌ఎ్‌సలో చేరి మంత్రి అయినప్పటి నుంచి ఆయన కన్ను పక్కనే ఉన్న తమ స్థలంపై పడిందని వారు వాపోయారు. ఇప్పటికి ఐదు సార్లు సర్వే జరగ్గా మల్లారెడ్డికి సర్వే నం.82/ఆ లో 1.29 ఎకరాల భూమి, తమకు సర్వే నం. 82/1/ఈఈలో 33 గుంటల భూమి ఉందని తేలిందన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, అనుచరులతో వచ్చి అధికారుల సమక్షంలోనే తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, స్థలం చుట్టూ వేసిన బ్లూ షీట్స్ ధ్వంసం చేశారని అన్నారు.