Manda Krishna Madiga: వర్గీకరణపై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలి
ABN , Publish Date - Aug 22 , 2024 | 03:42 AM
ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా లేక వ్యతిరేకమా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
సోనియా, రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
సీఎం రేవంత్ ప్రకటనను స్వాగతిస్తున్నాం: మందకృష్ణ
పంజాగుట్ట, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా లేక వ్యతిరేకమా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని, వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును ఎందుకు స్వాగతించడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయన కులానికే నాయకుడు తప్ప మాదిగలకు కాదన్నారు.
ప్రాణం ఉన్నంత వరకూ నల్ల కండువాను వదలనని స్పష్టం చేశారు. తమ ఉద్యమం దేశాన్ని ప్రభావితం చేసిందన్న ఆయన.. మాల సామాజిక వర్గంలో ఎదిగిన మేధావులు, రాజకీయ నాయకులు మనువాదులుగా తయారయ్యారని ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్‌రావు అధ్యక్షతన బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘క్రాస్ టాక్ విత్ మంద కృష్ణ మాదిగ’లో మాట్లాడారు.
వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, వర్గీకరణను నిర్వీర్యం చేస్తే ఎదుర్కొంటామన్నారు. ఆయన టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక మాదిగలకు చట్టసభల్లో సీట్లు తగ్గాయన్నారు. ప్రధాని మోదీ మనువాది కాదని, మానవతావాది అన్నారు. మాల సామాజిక వర్గంలో అంబేడ్కరిస్టులు లేరని, మనువాదుల సంఖ్య పెరిగిందని, వారు అసమానతలు తొలగించాలనుకోవడం లేదన్నారు. మాలలు రిజర్వేషన్ ఫలాలు ఎక్కువగా పొందారు కాబట్టే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా వారికి రావాలన్నారు.