Maoist Attack: సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి
ABN , Publish Date - Dec 07 , 2024 | 02:41 AM
వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు.. ప్రతి చర్యగా శుక్రవారం రాత్రి ఛత్తీ్‌సగఢ్ బీజాపూర్ పామేడు సమీపంలోని జీడిపల్లి సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి చేశారు.
పామేడు సమీపంలోని జీడిపల్లిలో ఘటన
బీజీఎల్స్‌తో కాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ప్లాన్?
ప్యారా బాంబుల వాడకంతో తిప్పికొట్టిన బలగాలు
చర్ల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు.. ప్రతి చర్యగా శుక్రవారం రాత్రి ఛత్తీ్‌సగఢ్ బీజాపూర్ పామేడు సమీపంలోని జీడిపల్లి సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్ నాయకుడు మాద్వి హిడ్మా ఆధ్వర్యంలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ దాడి దాదాపు 6 గంటల పాటు సాగింది. వందల మంది మావోయిస్టులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. జీడిపల్లిలో సీఆర్‌పీఎ్‌ఫ-228కి చెందిన 2 క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మొదటిది పూర్తయింది. నిర్మాణంలో ఉన్న రెండో క్యాంపుపై గురువారం అర్ధరాత్రి మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. లేజర్ గైడెడ్ బాంబులైన బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లను (బీజీఎల్స్) వినియోగించారు.
దీంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ప్రతిగా బలగాలు ప్యారా బాంబులు వేశాయి. కాగా, కాల్పుల సమయంలో బీజాపూర్ జిల్లా కీలక పోలీస్ అధికారులు క్యాంపుల్లోనే ఉన్నట్లు సమాచారం. మరోవైపు క్యాంపు నిర్మాణంలో పని చేస్తున్న కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, సమీప గ్రామస్థులు భయాందోళన చెందారు. సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లను మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారని, పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలోనే దాడికి పాల్పడ్డారని బలగాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి 16న పామేడు సమీపంలోని ధర్మారం క్యాంపుపై వందలమంది దాడికి దిగారు. శుక్రవారం దాడి జరిగిన ప్రదేశం.. జీడిపల్లి క్యాంపునకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణ సరిహద్దులోని చర్ల మండలానికి ఇవి 8 నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.