Share News

Maoists: ఇన్‌ఫార్మర్ల నెపంతో.. ఇద్దరి దారుణహత్య

ABN , Publish Date - Nov 23 , 2024 | 03:46 AM

కొంతకాలంగా వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తుల్ని హతమార్చి ఒక్కసారిగా అలజడి సృష్టించారు.

Maoists: ఇన్‌ఫార్మర్ల నెపంతో.. ఇద్దరి దారుణహత్య

  • ములుగు జిల్లా వాజేడులో నక్సల్స్‌ ఘాతుకం

  • కుటుంబ సభ్యుల ముందే గొడ్డళ్లు, కత్తులతో దాడి

  • మృతులిద్దరూ ఒక కుటుంబానికి చెందినవారు

  • ఒకరు పంచాయతీ కార్యదర్శి, మరొకరు కూలీ

వాజేడు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కొంతకాలంగా వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తుల్ని హతమార్చి ఒక్కసారిగా అలజడి సృష్టించారు. తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారన్న నెపంతో ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన ఉయిక రమేష్‌(37), అతని సోదరుడు ఉయిక అర్జున్‌(41)లను దారుణంగా నరికి చంపారు. వీరిలో రమేశ్‌ పంచాయతీ కార్యదర్శి కాగా అర్జున్‌ సాధారణ కూలీ. వీరిద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు. వరుసకు అన్నదమ్ములవుతారు. తెలంగాణ - ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దు అడవుల్లోని పెనుగోలుకు చెందిన ఈ ఇద్దరు ఆరేళ్లుగా మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో నివాసం ఉంటున్నారు. రమేశ్‌ 2019 నుంచి మండలంలోని పేరూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వీరిద్దరు పోలీసులకు సహకరిస్తూ ఇన్‌ఫార్మర్లుగా మారారని ఆరోపిస్తూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో రెండు బృందాలుగా వచ్చిన ఆరుగురు మావోయిస్టులు గొడ్డళ్లు, కత్తులతో వారి ఇళ్లలోకి చొరబడి నిద్రలో ఉన్న వారిపై దాడి చేసి హతమార్చారు. పోలీ్‌సస్టేషన్‌కు అరకిలోమీటరు దూరంలో ఈ సంఘటన జరిగింది. హత్యానంతరం ఘటన స్థలంలో వాజేడు- వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంతక్క పేరిట లేఖలను వదిలివెళ్లారు.


  • బంధువుల ద్వారా తమ కదలికలు తెలుసుకుంటున్నారనే...

రమేశ్‌, అర్జున్‌లు... ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్ర సరిహద్దులోని లంకపల్లి, ఊట్లపల్లి, ఆవుపల్లి ప్రాంతాల్లో వారి బంధువులు, సన్నిహితుల ద్వారా ఎప్పటికప్పుడు దళాల కదలికలను తెలుసుకుంటున్నారని, వన్యప్రాణుల వేట, పశువుల మేత నెపంతో అడవుల్లోకి వెళ్లే వారి ద్వారా తమ సమాచారం తీసుకొని పోలీసులకు చేరవేస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో తామే ఖతం చేసినట్లు వెల్లడించారు. దాడి సమయంలో మృతుల కుటుంబ సభ్యులు తమ వారిని చంపొద్దంటూ ప్రాధేయపడినప్పటికీ... రమేష్‌, అర్జున్‌ల భార్యలను పక్కకు నెట్టేసి దారుణంగా చంపి మావోయిస్టులు పగ తీర్చుకున్నారు. భయంతో వణికిపోయిన చుట్టుపక్కల ఇళ్ల వారు బయటకు రావాడానికి జంకారు. అర్జున్‌ ఘటన స్థలంలోనే మరణించగా కొనఊపిరితో ఉన్న రమేశ్‌ను సన్నిహితులు 108లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా, హత్యోదంతం జరిగిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులకు సమాచారం అందినా స్పందించలేదని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు మృతదేహాలను ఏటూరునాగారం ఆస్పత్రిలో ఉంచగా శుక్రవారం సాయంత్రం వరకు పోస్టుమార్టం నిర్వహించలేదని సమాచారం. ఈ జంట హత్యలపై ములుగు జిల్లా ఎస్పీ శబరీష్‌ స్పందించారు. మావోయిస్టు పార్టీకి సహకరించడం లేదనే పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ ముద్ర వేసి ఈ హత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఆదివాసీ హక్కులను హరిస్తూ మావోయిస్టులు చేసిన ఈ పాశవిక హత్యపై పౌరహక్కుల సంఘాలు వెంటనే స్పందించాలని ఎస్పీ డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 23 , 2024 | 03:46 AM