Sangareddy: వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలి: మంత్రి దామోదర
ABN , Publish Date - Aug 08 , 2024 | 08:04 PM
వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా(Damodar Rajanarasimha) పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సంగారెడ్డి: వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా(Damodar Rajanarasimha) పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, రోగులతో మాట్లాడి.. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఔట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు . ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పరిశుభ్రత పాటించాలని సూపరింటెండెంట్‌కి సూచించారు. మెడిసిన్ స్టాక్‌రూమ్ లో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అధ్యాపకులు, మెడికల్ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.
"సంగారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తాం. వైద్య వృత్తి చాలా పవిత్రమైంది. దానిని బాధ్యత, జవాబుదారీతనంతో నిర్వర్తించాలి. రోగులతో కలిసిపోతూ వైద్య వృత్తికి న్యాయం చేయాలి. పేదవారందరితోసహా, జబ్బు పడ్డ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే నియోజకవర్గ ప్రజలకు జిల్లా కేంద్రం గుండెకాయలాంటిది. ఆసుపత్రి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రులు వైద్య నిబంధనలను పాటించాలి. జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలి. డయాలసిస్ బెడ్లు పెంచాలి. రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఆసుపత్రి ప్రాంగణంలో పెండింగ్‌లో ఉన్న వసతి గృహ,అసంపూర్తి భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలి" అని దామోదర అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి , మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి , ఆర్డీవో వసంత కుమారి , డీఎంఈ వాణి, జీజీహెచ్ సూపరెంటెండెంట్ అనిల్, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి , ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.