NDSA: వానాకాలంలోపు మరమ్మతు డౌటే!
ABN , Publish Date - May 08 , 2024 | 04:08 AM
మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు అత్యవసరమని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) పేర్కొంది. బ్యారేజీ మరింత దెబ్బతినకుండా ఉండేందుకు వానాకాలంలోపు మరమ్మతులు చేయాలని సూచించింది.
మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు అత్యవసరమన్న జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
భవిష్యత్తులో బ్యారేజీ దెబ్బతినదనే గ్యారెంటీ లేదు
వానాకాలంలోపు రిపేర్లు చేయాలి
మధ్యంతర నివేదికలో ఎన్‌డీఎ్‌సఏ సూచనలు
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు అత్యవసరమని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) పేర్కొంది. బ్యారేజీ మరింత దెబ్బతినకుండా ఉండేందుకు వానాకాలంలోపు మరమ్మతులు చేయాలని సూచించింది. భవిష్యత్తులో బ్యారేజీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపింది. ప్రస్తుతం బ్యారేజీకి చేసే మరమ్మతులు యథాతథ స్థితిని కొనసాగించడానికి మాత్రమే ఉపకరిస్తాయంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన ఎలకో్ట్ర రెసిస్టివిటీ టెస్ట్ (ఈఆర్‌టీ), గ్రౌండ్ పినట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెస్ట్‌లతో పాటు బ్యారేజీ స్థితిగతులు, నిర్మాణ ఏజెన్సీలు, అధికారుల నివేదికలు, డిజైన్లు, డ్రాయింగ్‌లు పరిశీలించి, నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములైన అధికారులందరినీ సంప్రదించిన తర్వాత ఎన్‌డీఎ్‌సఏ.. బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి మధ్యంతర నివేదిక ఇచ్చింది. వానాకాలంలోపు బ్యారేజీల వైఫల్యంపై జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ (జీపీఐ), జియో టెక్నికల్ పరీక్షల అనంతరం.. డిజైన్లు/డ్రాయింగ్‌లు సిద్ధం చేసి, మరమ్మతులకు ఉపక్రమించాలని నిర్దేశించింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్ అనిల్ జైన్ మధ్యంతర నివేదికను పంపించారు. అందులోని వివరాలిలా ఉన్నాయి.
2019 జూన్‌లో మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించగా తొలి వరదల అనంతరం 2019 నవంబరులో గేట్లు మూసివేశారు. బ్యారేజీ దిగువ భాగంలో సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు (సీసీ బ్లాకులు), అఫ్రాన్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. కానీ, మరమ్మతులు చేయకుండా బ్యారేజీని వినియోగించడంతో 2023 అక్టోబరు 21న పిల్లర్లు కుంగిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్ నంబరు 16 నుంచి 21 దాకా వివిధ స్థాయిల్లో కుంగిపోయి, దెబ్బతిన్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ అఫ్రాన్లు దెబ్బతిన్నాయి. సీసీ బ్లాకులు చెల్లాచెదురయ్యాయి. అన్నారం బ్యారేజీతో పాటు గేట్ల వద్ద ఇసుక మేటలు వేస్తుండడంతో నీటిపారుదల శాఖ నిరంతరం దాన్ని తొలగించి, వరద సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. వానాకాలంలోపు బ్యారేజీలకు తగిన పరీక్షలు చేసి, మరమ్మతులు చేయాల్సిన బాధ్యత డ్యామ్ సేఫ్టీ చట్టం-2023 ప్రకారం డ్యామ్ ఓనర్ (రామగుండం చీఫ్ ఇంజనీర్)దే అని నివేదిక పేర్కొంది. ఈ సందర్భంగా బ్యారేజీల పునరుద్ధరణకు పలు సూచనలు చేసింది.
మేడిగడ్డ బ్యారేజీ మరింత దెబ్బతినకుండా మరమ్మతులు చేయాలి. అయితే, భవిష్యత్తులో బ్యారేజీ దెబ్బతినదనే గ్యారెంటీ లేదు.
పగుళ్లను నిరంతరం పరిశీలించాలి. బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో సీసీ బ్లాకులు ద్బెబతిన్నాయి.
పిల్లర్లు 16 నుంచి 22 దాకా పగుళ్లు వచ్చాయి. ఆ పిల్లర్లు మరింత దెబ్బతినకుండా ఇనుప పట్టీలు వేయాలి.
రాఫ్ట్(పునాది)పై భారం పడకుండా చూసుకోవాలి.
బ్లాకు-7 కుంగుబాటును నిరంతరం పరిశీలించడానికి వీలుగా టోటల్ స్టేషన్‌ను వినియోగించాలి. బ్లాక్-7 రాఫ్ట్ కింద ఇసుక జారింది. దీనికోసం ఇసుక నింపిన బస్తాలతో పాటు సిమెంట్ బస్తాలను వరుస క్రమంలో పెట్టాలి.
బ్యారేజీ అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ సీకెంట్ పైల్స్‌ను పరిశీలించాలి. ప్లింత్ స్లాబుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయిందా? లేదా? చూడాలి.
ఫ జీపీఐ చేసి, సీకెంట్ పైల్స్ దెబ్బతిన్న చోట షీట్ ఫైల్స్‌ను దించాలి. సీకెంట్ పైల్స్ ఎండ్ సీల్ మధ్య గ్రౌటింగ్ చేయాలి.
సీకెంట్ ఫైల్స్ వైఫల్యంతో రాఫ్ట్ కింద భారీ బొరియలు(రంధ్రాలు) పడినట్లు తెలుస్తోంది. వీటిని మూయడానికి రాఫ్ట్‌కు 5-7 సెంటీమీటర్లతో రంధ్రాలు వేయాలి. రెండు మీటర్ల కన్నా ఎక్కువ రంధ్రాలు వేయరాదు. సిమెంట్, ఇసుక, వాటర్‌తో గ్రౌటింగ్ చేయాలి.
వర్షాకాలంలో ఏడో బ్లాకు గేట్లన్నీ ఎత్తి ఉంచాలి. గేట్లతో పాటు అన్ని కాంపోనెంట్లను పరిశీలించాలి. ఏడో బ్లాకులోని 15-22గేట్లు ఓపెన్ కావడం లేదు. దీనికోసం క్రేన్లను ఏడో బ్లాకుపై కాకుం డా వేరే చోట పెట్టి, గేట్లను ఎత్తాలి.
పిల్లర్ నంబర్ 20-21 మధ్య ఉన్న గేట్లను తొలగించాలి.
బ్యారేజీ డౌన్‌స్ట్రీమ్/అ్‌పస్ట్రీమ్‌లోని సీకెంట్ పైల్స్‌ను శ్లాబును కలిపే సీసీ బ్లాకులు, ప్లింత్ స్లాబులు దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవి కట్టాలి. ఈ క్రమంలో వాటి కింద ఉన్న ఇసుకను సరిచేయాలి.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఒకే తరహా సమస్యలు ఉండడంతో వాటికి ఒకే తరహా మరమ్మతులు చేయాలి.
అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ సీకెంట్ పైల్స్‌ను పరిశీలించాలి.
నాలుగు వరుసలు ఉన్న బ్లాకులను తొలగించి, వాటి కింద ఉన్న ఇన్వర్టర్డ్ ఫిల్టర్ల స్థానంలో జియో టెక్స్‌టైల్ ఫిల్టర్లు పెట్టాలి. ఈ క్రమంలో రాళ్లు లేకుండా చేసుకోవాలి. నాలుగు వరుసల్లోని సీసీ బ్లాకులను ఇనుప కడ్డీలతో అనుసంధానం చేసి, వరదను దిగువకు వదిలిపెట్టినప్పుడు అవి కొట్టుకుపోకుండా చూసుకోవాలి.
డిజైన్లు/డ్రాయింగ్‌లు సిద్ధం చేయండి
బ్యారేజీల మరమ్మతుల కోసం జియో ఫిజికల్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి, మరమ్మతుల కోసం తగిన డిజైన్లు/డ్రాయింగ్‌లు సిద్ధం చేయాలని ఎన్‌డీఎస్‌ఏ గుర్తు చేసింది. నాలుగు వారాల్లో గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో.. ఎన్‌డీఎ్‌సఏ పరీక్షలు చేయడానికే దాదాపు నెలరోజులకు పైగా పడుతుంది. ఇక డిజైన్లు/డ్రాయింగ్‌లకు కనీసం 15 రోజుల సమయం కావాల్సిందే. అంటే వానాకాలంలోపు మరమ్మతులకు అవకాశం లేనట్లే.