Satya Nadella: స్కిల్స్ వర్సిటీ.. అద్భుత ఆలోచన
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:00 AM
‘‘ప్రస్తుత, భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు సరిపడా నైపుణ్యాలను సాధించడంపైనే యువత ఉపాధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఇది తెలంగాణను మరో స్థాయికి తీసుకెళ్తుంది
నైపుణ్యాలు, మౌలిక వసతులతోనే ఆర్థికాభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వాములవుతాం
సీఎం రేవంత్‌తో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల
ఏఐ, క్లౌడ్ రంగాల్లో సహకరించాలన్న సీఎం
ఏఐ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చిన శ్రీధర్‌బాబు
సత్య నాదెళ్ల నివాసంలో గంటకుపైగా భేటీ
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రస్తుత, భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు సరిపడా నైపుణ్యాలను సాధించడంపైనే యువత ఉపాధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలపైనే ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆకట్టుకున్నాయి’’ అని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. హైదరాబాద్ వచ్చిన సత్య నాదెళ్లను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌లు ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
సత్య నాదెళ్లతో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీతోపాటు నగరంలో 200 ఎకరాల్లో నిర్మించబోయే ఏఐ సిటీ, ప్రభుత్వ శాఖల్లో ఏఐ సాంకేతికత, ఈ రంగంలో ఉపాధి అవకాశాలపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, నగరంలో ఏర్పాటవుతున్న అంతర్జాతీయ ఐటీ కంపెనీల వివరాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను సత్య నాదెళ్ల ప్రశంసించారు. ఉపాధి అవకాశాలు పెంచడంలో స్కిల్స్ వర్సిటీ తెలంగాణను మరోస్థాయికి తీసుకెళ్తుందన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయడం అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. స్కిల్స్ వర్సిటీతోపాటు యువత నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ సహకారం ఉంటుందని సత్య నాదెళ్ల సీఎం రేవంత్‌రెడ్డికి హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఒకటిగా నిలుపుతాయని అభిప్రాయపడ్డారు.
ఏఐ, జెన్ ఏఐ, క్లౌడ్ రంగాల్లో సహకరించండి: సీఎం రేవంత్
హైదరాబాద్‌లో ఏర్పాటైన తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం నగరంలో 10 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడులను విస్తరిస్తున్నందుకు సత్య నాదెళ్లకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏఐ, జెన్ (జెనరేటివ్) ఏఐ, క్లౌడ్ రంగాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందని, దీనికి మైక్రోసాఫ్ట్ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నగరంలోని మేకగూడ, షాద్‌నగర్, చందన్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ మూడు డేటా సెంటర్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇవి కొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. దీనిపైనా సమావేశంలో చర్చ జరిగింది. త్వరగా వీటి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని సత్య నాదెళ్ల అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.