Share News

Komatireddy : కేటీఆర్‌తో మాకు పోలికా?

ABN , Publish Date - Dec 10 , 2024 | 03:57 AM

‘‘ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన నాయకులం మేము. కేటీఆర్‌తో మాకు పోలికా? కేసీఆర్‌ లేకుండా కేటీఆర్‌ ఎమ్మెల్యే అయ్యేవాడా?’’ అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. భవిష్యత్తులో ఒక వేళ కేటీఆర్‌ సీఎం అయినా.. తాము ఆయనకు విలువ ఇవ్వబోనని స్పష్టం చేశారు.

Komatireddy : కేటీఆర్‌తో మాకు పోలికా?

  • భవిష్యత్తులో కేటీఆర్‌ సీఎం అయినా.. పట్టించుకోను: చిట్‌చాట్‌లో కోమటిరెడ్డి

  • నెలలో ఒక రోజు సంక్షేమ హాస్టళ్ల పరిశీలన

  • విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేస్తాం: భట్టి

హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘‘ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన నాయకులం మేము. కేటీఆర్‌తో మాకు పోలికా? కేసీఆర్‌ లేకుండా కేటీఆర్‌ ఎమ్మెల్యే అయ్యేవాడా?’’ అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. భవిష్యత్తులో ఒక వేళ కేటీఆర్‌ సీఎం అయినా.. తాము ఆయనకు విలువ ఇవ్వబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో చిట్‌చాట్‌గా కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి.. ఆమె పుట్టిన రోజున అసెంబ్లీకి వచ్చి కృతజ్ఞతలు తెలిపరా? అని కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లిన కేసీఆర్‌.. ఆమె కాళ్లు మొక్కి గ్రూప్‌ ఫొటో దిగారన్నారు. సోనియా లేక పోతే తెలగాణ వచ్చేది కాదంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్‌.. ఈ రోజు అసెంబ్లీకి ఎందుకు రాలేదని నిలదీశారు.


కాగా, జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం భట్టి.. చేతికి ఎముక లేదన్నట్లుగా ఏది అడిగినా ఓకే అంటున్నారని, సచివాలయానికి పని కోసం వస్తే మాత్రం పైసలు లేవంటున్నారని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అంతకుముందు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రతి నెలలో ఒక రోజు ప్రజా ప్రతినిధులు, అధికారులు తరలివెళ్లి సంక్షేమ హాస్టళ్లను పరిశీలించే కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందులోభాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు సహా అధికారులు సంక్షేమ హాస్టళ్లను సందర్శించి, విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలిస్తారని చెప్పారు. అలాగే, విద్యార్థులతో కలిసి భోజనమూ చేస్తారన్నారు. ఈ నెల 16 లేదా 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉందన్నారు.

Updated Date - Dec 10 , 2024 | 03:57 AM