Share News

Tummala: ప్రత్యేక యాప్‌తో.. రైతు కుటుంబాల నిర్ధారణ

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:45 AM

పంట రుణాలు రూ.2లక్షల్లోపు బకాయిలున్న రైతుల్లో.. కుటుంబ నిర్ధారణ జరగని కుటుంబాలు 4,24,873 ఉన్నట్లుగా గుర్తించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummala: ప్రత్యేక యాప్‌తో..  రైతు కుటుంబాల నిర్ధారణ

  • ఇంకా 4.25 లక్షల కుటుంబాలను గుర్తించాల్సి ఉంది

  • వ్యవసాయాధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు

  • రూ.2 లక్షలకు మించిన రుణాలూ త్వరలో మాఫీ

  • అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తాం

  • మంత్రి తుమ్మల వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పంట రుణాలు రూ.2లక్షల్లోపు బకాయిలున్న రైతుల్లో.. కుటుంబ నిర్ధారణ జరగని కుటుంబాలు 4,24,873 ఉన్నట్లుగా గుర్తించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వీరి వివరాలను సేకరించి ఒక ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. శుక్రవారం వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపి, జాయింట్‌ డైరెక్టర్‌ ఉదయ్‌కుమార్‌తో సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రుణమాఫీకి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల సరళిని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుంటూ పెండింగ్‌లో ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఖాతాదారుల సమాచారాన్ని ేసకరించేందుకు వీలుగా ఒక కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు, అందులో వివరాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయాధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లడంతోపాటు రైతువేదికల వద్ద, వ్యవసాయశాఖ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారని తెలిపారు. అదే క్రమంలో ఆధార్‌ వివరాలు తప్పుగా నమోదైన 1,24,545 ఖాతాల్లో.. ఇప్పటికే 41,322 ఖాతాలను సరిచేసినట్లు పేర్కొన్నారు. ఇక వివిధ బ్యాంకుల్లోని రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేసిన సొమ్మును.. తిరిగి రైతలకు కొత్తగా అప్పు రూపంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెన్యువల్‌ చేసిన రైతు ఖాతాల సొమ్మును తిరిగి చెల్లించేలా, రుణమాఫీ అయిన ఖాతాలకు సంబంధించి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.


రైతులకు తిరిగి రూ.10 వేల కోట్ల చెల్లింపు..

ప్రభుత్వం ఆగస్టు 15 లోపు జమ చేసిన రూ.18 వేల కోట్లలో.. తిరిగి రూ.10,400 కోట్లను రైతులకు రుణాల రూపంలో బ్యాంకులు చెల్లించాయని మంత్రి తుమ్మల తెలిపారు. మిగిలిన ఖాతాదారులకు కూడా కొత్త రుణాలు వెంటనే మంజూరు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకు అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. ఇక రూ.2 లక్షలకు మించి ఉన్న రుణాలను కూడా త్వరలో దశల వారీగా మాఫీ చేస్తామని ప్రకటించారు. సాంకేతిక కారణాలతో నిలిచిన ఖాతాలు, కుటుంబ నిర్ధారణ జరగని రైతులు.. తమ దగ్గరలోని వ్యవసాయశాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఒకవేళ రైతు కుటుంబాలకు సంబంధించి కుటుంబ నిర్ధారణ చేసే సమయంలో బ్యాంకర్లు ఏవైనా తప్పులు చేస్తే.. వాటిని సరిచేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Updated Date - Aug 24 , 2024 | 03:45 AM