Uttam Kumar Reddyకాళేశ్వరం లేకున్నా.. ‘వరి రికార్డు’
ABN , Publish Date - Dec 02 , 2024 | 03:15 AM
బీఆర్‌ఎస్ నాయకులు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెబుతారని.. ఈ ఏడాది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చుక్క నీరు లేకున్నా రాష్ట్రంలో 66.5 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల టన్నుల వరి దిగుబడి వచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
66.5 లక్షల ఎకరాల్లో 1.5 కోట్ల టన్నుల పంట
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం సూచనను పాటిస్తాం: ఉత్తమ్
పెద్దపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నాయకులు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెబుతారని.. ఈ ఏడాది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చుక్క నీరు లేకున్నా రాష్ట్రంలో 66.5 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల టన్నుల వరి దిగుబడి వచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సూచన మేరకు క్యాబినెట్ పని చేస్తుందని తెలిపారు. ఆదివారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులు, పౌర సరఫరాల శాఖపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 4న పెద్దపల్లిలో జరగనున్న యువ వికాసం సభా స్థలికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. పెద్దపల్లిలో లక్ష మందితో యువ వికాసం సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పదేళ్లలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదని, తాము పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పా రు. 4న జరిగే బహిరంగ సభలో మరో తొమ్మిది వేల మందికి సీఎం ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారని చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.22 వేల కోట్ల రుణ మాఫీ చేశామని తెలిపారు. సన్న ధాన్యానికి 500 బోనస్ ఇచ్చామని.. యాసంగి సీజన్‌లో కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, రేషన్ వినియోగదారులకు సన్న బియ్యం ఎప్పటి నుంచి ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
మునుపెన్నడూ లేనివిధంగా రుణమాఫీ: శ్రీధర్‌బాబు
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ చేసిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో 2011లో గ్రూప్-1 పరీక్ష జరిగిందని, ఆ తర్వాత పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కారు ఎన్నడూ పరీక్ష నిర్వహించలేదన్నారు. తాము నిర్వహిస్తే కోర్టులకు వెళ్లి, ధర్నాలు చేసి బీఆర్‌ఎస్ అడ్డంకులు సృష్టించిందని.. అన్నింటినీ దాటుకుని గ్రూప్-1 పరీక్ష నిర్వహించామని చెప్పారు. త్వరలోనే 563 మంది అధికారులు రానున్నారని పేర్కొన్నారు. ఈ నెల 4న జరిగే యువ వికాసం సీఎం సభకు క్యాబినెట్ మంత్రులందరూ వస్తారని, విమర్శలు గుప్పించే ప్రతిపక్షాల నోళ్లు మూయించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు సభకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.