Uttam: పాలమూరు, కల్వకుర్తి, బీమా పనులు చేపట్టాలి
ABN , Publish Date - Dec 12 , 2024 | 03:23 AM
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ-3లో కెనాల్ సవరణ అంచనాలను ప్రభుత్వానికి పంపించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ-3లో కెనాల్ సవరణ అంచనాలను ప్రభుత్వానికి పంపించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాజెక్టులపై మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి, సమీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ-3కి సంబంధించి గతంలో స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ రూ.728.88 కోట్లకు ఆమోదించిందని అధికారులు ప్రస్తావించగా.. సవరణ అంచనాలకు పరిపాలన అనుమతి పొందడానికి వీలుగా ప్రభుత్వానికి ఫైలును పంపించాలని మంత్రి ఉత్తమ్ నిర్దేశించారు. భీమా ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 27, 19తో కెనాల్‌లో పూడికతీతతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ-28 పూడిక తీత పనులను చేపట్టాలని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని నిర్దేశించారు.