Gandhi Bhavan: రేపు గాంధీభవన్‌కు మంత్రి పొంగులేటి?
ABN , Publish Date - Sep 19 , 2024 | 04:51 AM
ఇకపై ప్రతి వారం.. బుధ, శుక్ర వారాల్లో ఎవరైనా ఒక మంత్రి.. గాంధీ భవన్‌లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.
వారంలో ఇద్దరు మంత్రుల రాక.. రేపటి నుంచే ప్రారంభం
బుధ, శుక్ర వారాల్లో ఒక్కొక్కరు వచ్చేలా షెడ్యూల్ రూపొందించండి
టీపీసీసీ అధ్యక్షుడి ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఇకపై ప్రతి వారం.. బుధ, శుక్ర వారాల్లో ఎవరైనా ఒక మంత్రి.. గాంధీ భవన్‌లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. సదరు మంత్రి.. కార్యకర్తలు, నేతల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. ఏ మంత్రి ఏ రోజున అందుబాటులో ఉండాలన్న అంశంపై షెడ్యూల్ రూపొందించాలని గాంధీభవన్ సిబ్బందికి టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గాంధీభవన్‌లో కార్యకర్తలు, నేతలకు మంత్రి అందుబాటులో ఉండే విధానం.. ఈ శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంతో పాటు గాంధీభవన్ ప్రాధాన్యతను పెంచేందుకే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న రోజునే.. వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు రావాలని, నెలలో రెండు సార్లు సీఎం రేవంత్‌రెడ్డి కూడా రావాలని సభా ముఖంగా కోరారు.