Share News

DSC: దరఖాస్తులో చిన్న తప్పిదం.. ఉద్యోగానికి దూరం

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:14 AM

డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులో చేసిన చిన్న తప్పు కారణంగా పలువురు అభ్యర్థులు ఎస్జీటీ ఉద్యోగాలకు దూరమయ్యారు. ఆ పొరపాటు గురించి అధికారులు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో గుర్తించారు.

DSC: దరఖాస్తులో చిన్న తప్పిదం.. ఉద్యోగానికి దూరం

  • దరఖాస్తులో డీఈడీ బదులు స్పెషల్‌ డీఈడీ ఆప్షన్‌ ఎంపిక

  • సంగారెడ్డి జిల్లాలో 10 మంది ఎస్జీటీ పోస్టులకు దూరం

సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులో చేసిన చిన్న తప్పు కారణంగా పలువురు అభ్యర్థులు ఎస్జీటీ ఉద్యోగాలకు దూరమయ్యారు. ఆ పొరపాటు గురించి అధికారులు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో గుర్తించారు. కొందరు అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు పొరపాటుగా డీఈడీ ఆప్షన్‌ బదులు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ డీఈడీ ఆప్షన్‌ ఎంచుకున్నారు. వారు డీఎస్సీ పరీక్ష కూడా రాశారు. పరీక్ష సమయంలో తాము చదివిన దానికి కొంత విరుద్ధంగా ప్రశ్నలు ఉండడంతో ఆందోళనకు కూడా గురయ్యారు.


ఇటీవల ఎస్జీటీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టుల భర్తీకి 1:3 నిష్పత్తిలో అధికారులు విడుదల చేసిన మెరిట్‌ జాబితాలో ఇలా తప్పుగా దరఖాస్తు చేసుకున్న వారు కొందరు ఉన్నారు. ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనలో వారు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ డీఈడీ చేయలేదని, పొరపాటున ఆ ఆప్షన్‌ ఎంచుకున్నారని తెలిసింది. సంగారెడ్డి జిల్లాలో ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చిన 52 మంది ఎస్జీటీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ అభ్యర్థుల్లో 10 మంది ఇలా తప్పుగా దరఖాస్తు చేసుకొని ఉద్యోగాలు కోల్పోయారు.

Updated Date - Oct 31 , 2024 | 04:14 AM