Nizamabad: నా కొడుకును బతికించండి
ABN , Publish Date - Nov 29 , 2024 | 03:52 AM
చిన్న వయసులోనే మధుమేహం, కాలేయ వ్యాధుల బారిన పడిన తన కుమారుడిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఓ తల్లి వేడుకుంది. నిజామాబాద్ జిల్లా బీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన అనూష కుమారుడు రితిక్ మూడో తరగతి చదువుతున్నాడు.
చిన్న వయసులోనే మధుమేహం, కాలేయ వ్యాధి
వైద్యానికి ఇప్పటికే ఉన్న ఇంటిని అమ్ముకున్నాం
సీఎం రేవంత్, దాతలు ఆదుకోవాలని తల్లి వేడుకోలు
బర్కత్‌పుర, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): చిన్న వయసులోనే మధుమేహం, కాలేయ వ్యాధుల బారిన పడిన తన కుమారుడిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఓ తల్లి వేడుకుంది. నిజామాబాద్ జిల్లా బీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన అనూష కుమారుడు రితిక్ మూడో తరగతి చదువుతున్నాడు. తండ్రి ఆటోడ్రైవర్. రితిక్ రెండేళ్ల వయసులోనే మధుమేహం, కాలేయ వ్యాధుల బారిన పడ్డాడు. అప్పటి నుంచి తల్లితండ్రులు అతన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చూపిస్తూ నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్‌లు, మందులు వాడుతున్నారు.
తమ కుమారుడి వైద్య ఖర్చుల కోసం ఇప్పటికే ఉన్న ఇంటిని అమ్మేశామని, ప్రస్తుతం తమ వద్ద చిల్లిగవ్వ లేదని బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద బాలుడి తల్లి అనూష మాట్లాడుతూ వాపోయారు. నెలకు మందులు, ఇంజక్షన్లకు రూ. 20 వేలు ఖర్చవుతోందని, డబ్బులు అయిపోవడంతో అప్పు చేసి బతికించుకుంటున్నామని చెప్పారు. తన కుమారుడి వైద్యానికి సీఎం రేవంత్‌రెడ్డి సహయం అందించాలని దాతలు కూడా ముందుకు వచ్చి ఆదుకోవాలని అనూష కోరారు.