Bellampally: పాప కోసం ఊయల కడితే తల్లి ప్రాణం పోయింది
ABN , Publish Date - Dec 14 , 2024 | 04:28 AM
ఏడుస్తున్న కూతురును ఆడించేందుకు చీరతో తల్లి ఊయల కట్టగా.. ఆ చీరే ఆమె ప్రాణం తీసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ విషాదం జరిగింది.
చిన్నారి ఏడ్పు మాన్పించేందుకు చీరతో ఊయల కట్టిన తల్లి
కొద్దిసేపటికి తాను ఊగుతుండగా మెడకు బిగుసుకున్న చీర
ఊపిరాడక మృతి.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం
బెల్లంపల్లి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఏడుస్తున్న కూతురును ఆడించేందుకు చీరతో తల్లి ఊయల కట్టగా.. ఆ చీరే ఆమె ప్రాణం తీసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ విషాదం జరిగింది. పట్టణంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన పోచంపల్లి విజయ్-నీరజ (42) దంపతులకు ముగ్గురు పిల్లల్లో 19నెలల సుచిత్ర చివరి సంతానం. గురువారం సాయంత్రం సుచిత్ర ఏడుస్తుండటంతో ఇంటి వరండాలో దూలానికి చీరతో ఊయల కట్టింది తల్లి నీరజ. పాపను ఆడించాక, కొద్దిసేపటికి చిన్నారిని దింపి.. ఆ ఊయలలో నీరజ ఊగింది. ఊయల ఊగుతున్న క్రమంలో చీర, నీరజ మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక మృతిచెందింది. కొద్దిసేపటికి నీరజ అత్త వచ్చి చూడగా అప్పటికే ఆమె కిందపడిపోయి ఉంది. స్థానికుల సాయంతో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు.