Share News

SI Harish: వాజేడు ఎస్సై ఆత్మహత్య

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:15 AM

ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ (29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూసూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రైవేటు రిసార్టులో సోమవారం ఆయన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నారు.

SI Harish: వాజేడు ఎస్సై ఆత్మహత్య

  • రిసార్టులో రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం

  • 2020లో పోలీసు ఉద్యోగానికి ఎంపికైన హరీశ్‌

  • ఆర్నెల్లుగా వాజేడులో విధులు

  • ఆత్మహత్య సమయంలో ఆయనతో ఓ యువతి

  • వీరి మధ్య ప్రేమ.. పెళ్లి కోసం ఒత్తిడి అంటూ కథనాలు

  • వ్యక్తిగత కారణాలతోనే ఎస్సై బలవన్మరణం: ఎస్పీ

వాజేడు/రేగొండ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ (29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూసూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రైవేటు రిసార్టులో సోమవారం ఆయన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నారు. తల కింది భాగం నుంచి తూటా వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. పేలుడు శబ్దం విన్న రిసార్టు సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా.. హరీశ్‌ రక్తపుమడుగులో కనిపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఆత్మహత్యకు కారణాలపై వదంతులు వ్యాపించాయి. పని ఒత్తిడి వల్లేనని తొలుత ప్రచారం జరగ్గా.. ప్రేమ వ్యవహారంతోనే అనే చర్చలు సాగుతున్నాయి. వీటిపై పోలీసు శాఖ విచారణ చేపట్టింది. క్లూస్‌ టీం ఆధారాలను సేకరించింది. కాగా, వాజేడు ఠాణా పరిధిలో ఇటీవల పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని మావోయిస్టులు హత్య చేశారు. రెండు నెలల క్రితం కూడా.. మావోయిస్టులు రెండుసార్లు సమావేశం నిర్వహించారు.


ఈ పరిస్థితుల్లో పని ఒత్తిడితోనే ఎస్సై హరీశ్‌ బలవన్మరణానికి పాల్పడారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఎస్పీ శబరీశ్‌ మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత కారణాలతోనే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన హరీశ్‌.. 2020లో ఎస్సైగా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం వాజేడు మండలం పేరూరులో 2022లో విధుల్లో చేరారు. ఏడాది పాటు ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేసి, వీఆర్‌లో ఉంచా రు. జూన్‌ 17న వాజేడు ఎస్సైగా వచ్చారు. కాగా, హరీశ్‌కు వివాహం కాలేదు. మల్లికాంబ, రామన్న దంపతుల రెండో కుమారుడు ఈయన. అన్న కుమారస్వామి సీఐఎ్‌సఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌గా అసోంలో పనిచేస్తున్నారు. హరీశ్‌కు చెల్లెలికి వివాహమైంది.


  • ఆ యువతి ఎవరు?

హరీశ్‌ బలవన్మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయనతో పాటు ఓ యువతి ఉండడం, ఎస్సై మృతదేహంపై పడి ఆమె రోదిస్తున్న ఫొటో వైరల్‌ అయింది. యువతిని కొద్దిసేపటికి అక్కడి నుంచి ఎవరో తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఈమెతో ఆదివారం సాయంత్రమే హరీశ్‌ రిసార్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కాగా, హరీశ్‌కు త్వరలో మరో యువతితో పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో హరీశ్‌తో ఉన్న యువతి పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో, ఎటూ తేల్చుకోలేక ఆయన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. రిసార్ట్‌లో అర్ధరాత్రి వరకు కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఆ యువతి ఎవరు? అనేది స్పష్టం కాలేదు. పోలీసులు కూడా గోప్యత పాటిస్తున్నారు. విధి నిర్వహణ విషయంలో హరీశ్‌కు మంచి పేరుంది. ఆత్మహత్య వెనుక బలమైన కారణాలు ఉండి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితులు సైతం హరీశ్‌ అందరితో కలుపుగోలుగా ఉంటారని చెబుతున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇందులో కుట్ర ఉందని విచారణ జరపాలని కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 03:15 AM