N Rammurthy Naidu: ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూత
ABN , Publish Date - Nov 17 , 2024 | 03:20 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు(72) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 14న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.
14న గుండె సంబంధ సమస్యతో ఆస్పత్రికి .. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస
తిరుపతి/రాయదుర్గం/అమరావతి/న్యూఢిల్లీ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు(72) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 14న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులుగా ఆరోగ్యం విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి అత్యాధునిక చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని, మధ్యాహ్నం 12.45గంటలకు కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య ఇందిర, కుమారులు గిరీశ్, రోహిత్ ఉన్నారు. వీరిలో రోహిత్ సినీనటుడు కాగా, గిరీశ్ గల్ఫ్‌లో వ్యాపారం చేస్తున్నారు. సోదరుడి ఆరోగ్యం విషమించిన వార్త తెలియగానే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు.
తమ్ముడి పార్ధివదేహానికి నివాళులర్పించి, ఆయన కుమారులు రోహిత్, గిరీశ్‌ను ఓదార్చారు. రామ్మూర్తినాయుడు భౌతికకాయం ఆదివారం ఉదయం 8 గంటలకు విమానంలో రేణిగుంటకు చేరుకోనుంది. అక్కడి నుంచి 9గంటలకు స్వస్థలమైన చంద్రగిరి మండలం నారావారిపల్లికి తరలించనున్నారు. నారావారిపల్లిలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా రామ్మూర్తినాయుడు మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. రామ్మూర్తినాయుడి భౌతికకాయానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళి అర్పించారు. రామ్మూర్తినాయుడు కుటుంబసభ్యులకు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ సీఎం చంద్రబాబును ఫోన్‌లో పరామర్శించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.