Share News

TG: వర్చువల్‌ తనిఖీలు.. జరిమానాలు

ABN , Publish Date - May 16 , 2024 | 05:01 AM

నిబంధనల ప్రకారం లేని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) జరిమానాల కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్రంలోని ఈ కాలేజీలను ఎన్‌ఎంసీ వర్చువల్‌ పద్ధతిలో తనిఖీ చేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని 9 మినహా దాదాపు అన్ని కాలేజీల్లోనూ ఈ తనిఖీలు పూర్తయినట్లు ఎన్‌ఎంసీ వర్గాలు వెల్లడించాయి. గాంధీ, ఉస్మానియాతో పాటు గత ఏడాది కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలలను కూడా తనిఖీ చేశారు.

TG: వర్చువల్‌ తనిఖీలు.. జరిమానాలు

  • వైద్య కళాశాలల్లో లోపాలపై ఎన్‌ఎంసీ కొరడా.. ప్రైవేటుతో పాటు ప్రభుత్వ కాలేజీలపై దృష్టి

  • మినహా అన్ని సర్కారీ కళాశాలల తనిఖీ.. లోపాలున్న వాటికి గరిష్ఠంగా 10 లక్షల ఫైన్‌

  • నెలల్లో సవరించుకోకుంటే చెల్లించాల్సిందే.. ఇక నుంచి ఏటా గుర్తింపు ఫీజులు కట్టాలి

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): నిబంధనల ప్రకారం లేని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) జరిమానాల కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్రంలోని ఈ కాలేజీలను ఎన్‌ఎంసీ వర్చువల్‌ పద్ధతిలో తనిఖీ చేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని 9 మినహా దాదాపు అన్ని కాలేజీల్లోనూ ఈ తనిఖీలు పూర్తయినట్లు ఎన్‌ఎంసీ వర్గాలు వెల్లడించాయి. గాంధీ, ఉస్మానియాతో పాటు గత ఏడాది కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలలను కూడా తనిఖీ చేశారు. ఇందులో కొన్నింటికి రూ.2 లక్షలు, మరికొన్నింటికి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు జరిమానా వేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన నోటీసులు ఇంకా కాలేజీలకు అందలేదని తెలుస్తోంది. తనిఖీల్లో బయటపడిన లోపాలను రెండు మాసాల్లోగా సరిదిద్దుకోవాలని ఎన్‌ఎంసీ సూచించింది. లేదంటే జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటి దాకా కాలేజీల్లో నిబంధనల మేరకు సౌకర్యాలు లేకుంటే సీట్లలో కోత విధించడమో లేకుంటే, గుర్తింపును తాత్కాలికంగా ఆ ఏడాదికి రద్దు చేయడమో చేసేవారు. ఈ ఏడాది నుంచి కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చారు. ముందుగా జరిమానాలు విధిస్తారు. కాలేజీ గుర్తింపును మాత్రం రద్దు చేయరు. ఎన్‌ఎంసీ ప్రధానంగా అధ్యాపకులు హాజరును పరిశీలిస్తోంది. ప్రస్తుతం ప్రొఫెసర్ల హాజరు కోసం అబాస్‌ విధానం అమలు చేస్తున్నారు.


ప్రొఫెసర్లు ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేయాలి. అది వెంటనే ఢిల్లీలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. దాని ఆధారంగా వారి హాజరును ఎన్‌ఎంసీ స్వయంగా పర్యవేక్షిస్తోంది. హాజరు 75 శాతం కంటే తక్కువగా ఉండే కాలేజీలకు కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తోంది. అనుబంధ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యకు అనుగుణంగా ఓపీ, ఐపీ లేకున్నా కూడా దాదాపు అదే స్థాయిలో జరిమానా విఽధిస్తామని ఎన్‌ఎంసీ పేర్కొంది. ప్రధానంగా ఈ రెండు విషయాలపై ఎన్‌ఎంసీ దృష్టి సారించింది. ఎన్‌ఎంసీ కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి ప్రతీ కాలేజీ విఽధిగా వార్షిక నివేదిక ఇవ్వాలి. దాన్ని ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దాని ఆధారంగానే ఎన్‌ఎంసీ గుర్తింపునిస్తుంది. అధ్యాపకుల హాజరు శాతం, వారి వివరాలు, అవుట్‌ పేషెంట్లు, ఇన్‌పేషెంట్లు, ల్యాబ్‌ రిపోర్జులు, చేసిన సర్జరీల గణాంకాలు వంటివి ఉండాలి. ఈ వివరాలను ఎన్‌ఎంసీ వర్చువల్‌ తనిఖీలో కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ ‘హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (హెచ్‌ఎమ్‌ఐఎ్‌స)’లో ఉన్న గణాంకాలతో పోల్చి చూస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయి కాలేజీలకు గుర్తింపు వచ్చిన తర్వాతే మెడికోలు తదుపరి తరగతులకు వెళ్లే, కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఎన్‌ఎంసీ మెడికల్‌ కాలేజీలను భౌతికంగా తనిఖీలు చేయదు. వార్షిక నివేదికల ఆధారంగా వర్చువల్‌ తనిఖీలు మాత్రమే చేసి గుర్తింపు ఇవ్వనుంది.


గుర్తింపు ఫీజుల భారం!

ఇక నుంచి మెడికల్‌ కాలేజీలన్నీ ప్రతీ ఏటా విఽధిగా ఎన్‌ఎంసీ నుంచి గుర్తింపు పొందాలి. ఇప్పటి వరకు పాత కాలేజీలు ప్రతి ఐదేళ్లకొకమారు, కొత్తవి ప్రతీ ఏటా గుర్తింపు పొందాల్సి ఉండేది. కొత్త నిబంధన ప్రకారం కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీ ఎన్‌ఎంసీ నుంచి ప్రతీ సంవత్సరం గుర్తింపు పొందాలి. అంతేకాకుండా గుర్తింపు కోసం ప్రతీ ఏటా ఫీజులు కూడా చెల్లించాలి. ప్రభుత్వ వైద్య కళాశాలలకు రూ.3 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు ఒక్కో పాత కాలేజీకి ఐదేళ్లకొకమారు ఉండేది.

Updated Date - May 16 , 2024 | 05:01 AM