Share News

NDMA: మేడిగడ్డకు మళ్లీ పరీక్షలు!

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:28 AM

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వరద తగ్గుముఖం పట్టాక మళ్లీ పరీక్షలు చేయాలని ‘జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ)’ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.

NDMA: మేడిగడ్డకు మళ్లీ పరీక్షలు!

  • అన్నారం, సుందిళ్లకు కూడా..

  • వరద తగ్గిన తర్వాత పరీక్షలు చేసి, రిపోర్టులు ఇస్తేనే ఎన్‌డీఎస్‌ఏ నివేదిక

  • తేల్చిచెప్పిన నిపుణుల కమిటీ

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వరద తగ్గుముఖం పట్టాక మళ్లీ పరీక్షలు చేయాలని ‘జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ)’ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఆ పరీక్షల ఫలితాలు వస్తేనే బ్యారేజీల భవితవ్యంపై పూర్తి నివేదికను అందించగలమని తేల్చిచెప్పింది. ఇటీవలే తుది నివేదిక కోసం ఢిల్లీలో నిపుణుల కమిటీతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు అధికారుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే. బ్యారేజీల పునరుద్ధరణపై తుది నివేదికను అందించాలని మంత్రితో పాటు అధికారులు పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి, ఫలితాలు అందించకపోతే నివేదికలు ఇవ్వలేమని ఎన్‌డీఎ్‌సఏ పునరుద్ఘాటించింది.


కాగా, అన్నారం, సుందిళ్లలో నీటి నిల్వకు ఎన్‌డీఎ్‌సఏ అనుమతి ఇస్తే కన్నెపల్లి పంప్‌ హౌస్‌కు కొద్దిదూరంలో మట్టికట్ట కట్టి, దానిపై జియోట్యూబ్‌లతో రక్షణ కల్పించి, నీటిని నిలిపివేయడం ద్వారా అన్నారంలోకి, ఆ తర్వాత సుందిళ్లలోకి పంపింగ్‌ చేసి, రబీతో పాటు తాగునీటి అవసరాలు తీర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే డిసెంబరు దాకా నివేదిక ఇచ్చేదే లేదని ఎన్‌డీఎ్‌సఏ తేల్చిచెప్పడం రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారింది. ఇక ఇప్పటికిప్పుడు పరీక్షలు చేసే పరిస్థితులు కూడా లేవు. సుందిళ్లకు 9131 క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 5907 క్యూసెక్కులు, మేడిగడ్డకు 83,330 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ వరద ఇప్పట్లో తగ్గే అవకాశాల్లేవు. దీంతో వరద తగ్గితే అధికారులు నవంబరులో పరీక్షలకు ఉపక్రమించే అవకాశాలున్నాయి.


మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అధ్యయన బాధ్యతను ఎన్‌డీఎ్‌సఏకు అప్పగించి, ప్రభుత్వం ఇరకాటంలో పడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ, దిగువ భాగంలో 8 నుంచి 9 మీటర్ల లోతులో డయాఫ్రం వాల్‌ మాదిరిగా ఆర్‌సీసీ లేదా షీట్‌పైల్స్‌తో కటాఫ్‌ వేస్తే సీపేజీలు తగ్గుముఖం పడతాయని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత బ్యారేజీల్లో పంప్‌హౌ్‌సల హెడ్‌లకు అందినంత మేర నీటి నిల్వలు చేసుకుంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిక్షేపంగా ఉంటాయని పేర్కొంటున్నారు. షీట్‌పైల్స్‌తో యుద్ధప్రాతిపదికన కటా్‌ఫలు వేసుకోవడం మేలని సూచిస్తున్నారు. అయితే ఎన్‌డీఎ్‌సఏ నివేదికపై ఆధారపడితే రబీలో సమస్యలు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీకి బాధ్యతలు అప్పగించడంతో ప్రభుత్వం బద్నాం అయ్యే పరిస్థితి ఏర్పడిందని పలువురు అధికారులు గుర్తుచేస్తున్నారు.

Updated Date - Oct 15 , 2024 | 04:28 AM