Share News

SI Harish: వాజేడు ఎస్సై నాకు కొత్త జీవితం ఇస్తానన్నాడు!

ABN , Publish Date - Dec 09 , 2024 | 04:25 AM

వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆత్మహత్య సమయంలో అతడి వద్దే ఉన్న యువతి.. తమ మధ్య ఉన్న సంబంధంపై ఆదివారం పలు విషయాలు వెల్లడించింది.

SI Harish: వాజేడు ఎస్సై నాకు కొత్త జీవితం ఇస్తానన్నాడు!

  • గతం తెలిసే ప్రేమించాడు

  • నేనేమీ బ్లాక్‌ మెయిల్‌ చేయలేదు

  • ఎస్సైతో సంబంధాన్ని వెల్లడించిన యువతి

  • వైరల్‌గా మారిన వీడియో

ములుగు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆత్మహత్య సమయంలో అతడి వద్దే ఉన్న యువతి.. తమ మధ్య ఉన్న సంబంధంపై ఆదివారం పలు విషయాలు వెల్లడించింది. పెళ్లి చేసుకోవాలని తాను హరీశ్‌ను ఒత్తిడి చేయలేదని, డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేయలేదని తెలిపింది. తన గతం గురించి అన్నీ తెలిసిన హరీశ్‌ కొత్త జీవితం ఇస్తానని మాటిచ్చాడని, ఆత్మహత్య చేసుకునే ముందు నిమిషం వరకు కూడా తనను ప్రేమించాడని తెలిపింది. ఓ మీడియా ఛానెల్‌కు ఫోన్‌ ద్వారా ఆమె చెప్పిన ఈ సమాచారం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి విషయమై ఎస్సై హరీశ్‌ ఆమెతో మాట్లాడిన ఆడియో కూడా అందు లో ఉంది. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో హరీశ్‌తో తనకు పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపింది. ఆయన ఎస్సై అని కొద్దిరోజుల తర్వాత తెలియడంతో గతంలో తనను కొందరు మోసం చేసిన విషయం, కేసుల సమాచారాన్ని చెప్పి న్యాయ సహాయం కోరానని పేర్కొంది.


ఈ పరిచయం ప్రేమకు దారితీసిందని తెలిపింది. తనకు కొత్తజీవితం ఇస్తానని చెప్పి తొలుత హరీశే పెళ్లి ప్రస్తావన చేశాడని చెప్పింది. ‘మనిద్దరికి పెళ్లి కావాలంటే మా ఉన్నతాధికారుల ఎదుటనైనా, పోలీ్‌సస్టేషన్‌ ముందైనా, నా ఇంటివద్దనైనా ధర్నా చేయాలి’ అని సలహా కూడా ఇచ్చాడని తెలిపింది. ఆత్మహత్యకు ముందురోజు తాము ప్రైవే టు రిసార్టులో కలిశామని, ఇద్దరి మధ్య ఏ గొడవా జరగలేదని పేర్కొంది. హరీశ్‌ సోదరుడి సమక్షంలోనే పెళ్లి గురించి మాట్లాడుకున్నామని చెప్పింది.


పెద్దలు ఒప్పుకోకుంటే ఎవరి జీవితం వాళ్లు గడుపుదామని చెప్పానని వెల్లడించింది. హనుమకొండలో పెళ్లిచేసుకుందామని చెప్పి తనను వాహనం వద్దకు వెళ్లాలని పంపించిన హరీశ్‌.. గడియ పెట్టుకొని తుపాకీతో కాల్చుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రోజు మీడియాతో మాట్లాడే అవకాశమివ్వకుండా పోలీసులు తనను దూరం గా తీసుకెళ్లారని ఆమె తెలిపింది. ఈనెల 3న పేరూరు పోలీసులు ఆ యువతిని సూర్యాపేట జిల్లాలోని స్వగ్రామానికి తీసుకువెళ్లి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆతర్వాత ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తాజాగా ఆమె చెప్పిన సమాచారమంటూ ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.

Updated Date - Dec 09 , 2024 | 08:23 AM