Share News

NHRC: ఇష్టముంటేనే భూములివ్వండి!

ABN , Publish Date - Nov 24 , 2024 | 03:30 AM

ఫార్మా కంపెనీల కోసం రైతులు ఇష్టముంటేనే భూములు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సూచించింది. లేదంటే కోర్టుకు వెళ్లి భూసేకరణపై స్టే తెచ్చుకోవాలని పేర్కొంది.

NHRC: ఇష్టముంటేనే భూములివ్వండి!

  • లేదంటే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి

  • లగచర్ల బాధితులతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ

బొంరా్‌సపేట్‌/కొడంగల్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఫార్మా కంపెనీల కోసం రైతులు ఇష్టముంటేనే భూములు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సూచించింది. లేదంటే కోర్టుకు వెళ్లి భూసేకరణపై స్టే తెచ్చుకోవాలని పేర్కొంది. బలవంతంగా ఎవరూ భూములు లాక్కోరని తెలిపింది. శనివారం వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, రోటిబండ తండాలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులు పర్యటించారు. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్టయిన వారి కుటుంబ సభ్యులతో కమిషన్‌ రిజిస్ర్టార్‌ ఆఫ్‌ లా ముఖేశ్‌, ఇన్‌స్పెక్టర్లు రోహిత్‌సింగ్‌, ప్రకాశ్‌శర్మ మాట్లాడారు. ఒక్కొక్కరి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. ఆ రోజు లగచర్లలో ఏం జరిగింది? ఘటన తర్వాత పోలీసులు వచ్చి ఏం చేశారు? అని బాధిత కుటుంబాల సభ్యులను అడిగారు.


దీంతో ఘటన తీరును మహిళలు వివరించారు. రోటిబండ తండాకు చెందిన సోనీబాయి మాట్లాడుతూ.. నవంబరు 11న అర్ధరాత్రి కరెంటు నిలిపేసి తండాలో 500 మందికిపైగా పోలీసులు వచ్చారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులకు తెలిపారు. ఆ సంఘటనలో తన కొడుకు లేకపోయినా బలవంతంగా తీసుకెళ్లారని చెప్పారు. కాగా, తాను పోలీసుల భయంతో అనారోగ్యానికి గురయ్యానని ప్రమీల అనే మహిళ తెలిపారు. అధికారులు పంచాయతీ కార్యదర్శిని పిలిపించి ఆమెను ఆస్పత్రికి పంపించారు. అలాగే సక్రియా నాయక్‌ అనే రైతు మాట్లాడుతూ.. తన కుమారుడు ఎక్కడున్నాడో, ఏ జైలులో పెట్టారో తెలియడం లేదని చెప్పడంతో కమిషన్‌ అధికారులు స్పందిస్తూ ఆచూకీ తెలియనివారి కోసం పోలీ్‌సస్టేషన్‌లో తప్పిపోయినట్లు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా.. ఇప్పుడున్న ధర కంటే రెట్టింపు ధర ఇస్తే భూములు ఇస్తారా? అని కమిషన్‌ సభ్యులు ప్రశ్నించారు. అయితే.. ఎంత ధర ఇచ్చినా భూములు ఇవ్వం అని వారు తేల్చి చెప్పారు.


  • పొలం పనులకు ఇబ్బందిగా మారింది..

పోలీసుల చర్య కారణంగా తండాలో మగవారంతా భయంతో వేరే చోట్లకు వెళ్లారని రోటి బండతండాకు చెందిన శాంతిబాయి చెప్పారు. వరి కోతకొచ్చిందని, అందరూ జైలులో, బయట ఉండటంతో పొలం పనులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. దీంతో కోర్టులో జమానత్‌ పిటిషన్‌ వేసి లొంగిపోతే బెయిల్‌ వస్తుందని కమిషన్‌ సభ్యులు చెప్పారు. పోలీసులకు లొంగిపోని వారుంటే యాంటిసిపేటరీ బెయిల్‌కు పిటిషన్‌ వేయాలన్నారు. విచారణలో భాగంగా సంగారెడ్డి జైలుకు సైతం వెళ్తున్నట్టు కమిషన్‌ సభ్యులు చెప్పారు. నివేదికను ఎన్‌హెచ్‌ఆర్‌సీకి అందజేస్తామన్నారు. కాగా, వాంగ్మూలంపై సంతకాలు చేయాలని అధికారులు కోరగా తండావాసులు అంగీకరించలేదు.

Updated Date - Nov 24 , 2024 | 03:30 AM