Share News

Pushpa-2: ‘పుష్ప-2’ పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

ABN , Publish Date - Dec 06 , 2024 | 11:10 AM

అల్లుఅర్జున్ హీరోగా విడుదలైన పుష్ప-2 సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద మహిళ మృతి చెందిన ఘటన వ్యవహారం ఎన్‌హెచ్‌ఆర్సీకి వెళ్లింది..

Pushpa-2: ‘పుష్ప-2’ పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
pushpa 2

ఢిల్లీ: ‘పుష్ప-2’ సినిమాపై న్యాయవాది రామారావు ఇమ్మినేని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) కు ఫిర్యాదు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నా పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ఫిర్యాదులో తెలిపారు. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకోకపోవడంతోనే మహిళ మృతి చెందినట్టు పిటిషనర్ ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ దీనిపై దర్యాప్తు జరపనుంది.


హీరో అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్‌ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (39) మృతి చెందింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్‌ పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి 9.30 గంటల ప్రీమియర్‌ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్‌, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్‌, సన్వీక (7) దిల్‌సుఖ్‌ నగర్‌ నుంచి సంధ్య థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో.. హీరో అల్లు అర్జున్‌ సంధ్య థియటర్‌ వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు.


అల్లు అర్జున్‌ థియేటర్‌లోకి వెళ్లాక.. అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో రేవతి, ఆమె కుమారుడు, మరో వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయారు. పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి.. ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే రేవతి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అల్లు అర్జున ఇంకా స్పందించలేదు. పోలీసులు, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Dec 06 , 2024 | 12:06 PM