NHRC: ‘సరగసీ’ మహిళ మృతి..
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:48 AM
సరగసీకి సహకరించి ఆర్థిక లబ్ధి పొందుదామని హైదరాబాద్ వచ్చి కామాంధుడి చెర నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి పడి ఒడిశాకు చెందిన వివాహిత మరణించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
కేసు సుమోటోగా విచారణకు స్వీకరించిన
జాతీయ మానవ హక్కుల కమిషన్
రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశం
నిందితుడు రాజేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం
న్యూఢిల్లీ, రాయదుర్గం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): సరగసీకి సహకరించి ఆర్థిక లబ్ధి పొందుదామని హైదరాబాద్ వచ్చి కామాంధుడి చెర నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి పడి ఒడిశాకు చెందిన వివాహిత మరణించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ) ఈ కేసును సమోటోగా విచారణకు స్వీకరించింది. వివాహిత మృతి ఘటనపై రెండు వారాల్లోగా తమకు సమగ్ర నివేదిక అందజేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
ఎఫ్‌ఐఆర్ స్థితిగతులతోపాటు సరగసీ పేరిట మహిళలపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి తెలంగాణ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది. వివాహిత మృతిపై మీడియా కథనాల్లోని అంశాలు నిజమైతే మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన అంశాన్ని లేవనెత్తుతాయని కమిషన్ అభిప్రాయపడింది. కాగా, ఈ కేసులో నిందితుడు రాజేశ్‌బాబును అరెస్టు చేసినట్టు శుక్రవారం పోలీసులు ప్రకటించారు. శనివారం అతడిని కోర్టులో హాజరుపరిచే అవకాశం వుంది.