Share News

NIMS: అదనంగా రూ.430 కోట్లు అవసరం

ABN , Publish Date - Dec 12 , 2024 | 04:16 AM

పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) అదనపు భవనాల నిర్మాణానికి అదనంగా రూ.430 కోట్లు అవసరమని ఆర్‌ అండ్‌ బీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

NIMS: అదనంగా రూ.430 కోట్లు అవసరం

  • పెరుగుతున్న నిమ్స్‌ అంచనాలు.. ప్రభుత్వానికి నివేదించిన ఆర్‌ అండ్‌ బీ

  • ఇప్పటికే రూ.1,698 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) అదనపు భవనాల నిర్మాణానికి అదనంగా రూ.430 కోట్లు అవసరమని ఆర్‌ అండ్‌ బీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గత ప్రభుత్వ హయాంలో నిమ్స్‌ అదనపు భవనాలకు శంకుస్థాపన జరగ్గా, పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో రూపొందించిన ప్రాజెక్టులో పొందుపర్చని పలు అంశాలు తాజాగా తెరమీదకు రావడంతో పాటు, కొత్తగా చేపట్టాలని నిర్ణయించిన పలు పనులు చాలా అవసరమంటూ అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో నిమ్స్‌ అదనపు భవనాల పనులకు సంబంధించి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ ప్రభుత్వానికి సమగ్ర వివరాలను ఒక నివేదిక ద్వారా తెలిపింది. ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే మంజూరు చేసిన రూ.1,698 కోట్లకు అదనంగా మరో రూ.430 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. దీనిపై ప్రభు త్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.


ఇవీ అదనపు పనులు

ఎంట్రన్స్‌ ఎలివేటెడ్‌ ర్యాంపునకు రూ.40.25 కోట్లు, మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ కోసం రూ.169.12 కోట్లు, సబ్‌స్టేషన్‌కు రూ.28 కోట్లు, విద్యుత్‌ హై టెన్షన్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, వాటర్‌ లైన్లను మరోచోటకు మార్చేందుకు రూ.20.70 కోట్లతో పాటు మరికొన్ని పనులకు కలిపి రూ.374.13కోట్లు అవుతుందని నివేదికలో పేర్కొన్నారు. దీనికి ట్యాక్స్‌లు రూ.56.56 కోట్లు.. మొత్తంగా మరో రూ.430.69 కోట్లు అదనపు నిధులు అవసరమని నివేదికలో పేర్కొన్నారు.


19.54 ఎకరాలు.. 5 బ్లాకుల్లో నిర్మాణం

నిమ్స్‌ అదనపు భవనాలను దాదాపు 19.54 ఎకరాల్లో.. 5 బ్లాకులుగా విభజించి నిర్మిస్తున్నారు. ఆసుపత్రి, యుటిలిటీ బ్లాకులు అన్నీ కలిపి దాదాపు 26,19,204 చదరపు అడుగుల మేర ఉండనున్నాయి. వీటిలో ఆసుపత్రి భవనాలు 4 ఉంటాయి. కాగా, 30 లక్షల లీటర్ల నీటి సామర్ధ్యంతో కూడిన భూగర్భ ట్యాంకును ఏర్పాటు చేయనున్నారు. ఆసుపత్రిలో మొత్తం 53 ఆపరేషన్‌ థియేటర్లు, 53లిఫ్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ అదనపు ఆసుపత్రి భవనంలో 2020 పడకలను ఏర్పాటు చేయను న్నారు. మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ కోసం రూ.98.47 కోట్లను ఖర్చు చేయనున్నారు. కాగా, నిర్మాణ పనులను 2026 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

Updated Date - Dec 12 , 2024 | 04:16 AM