TG: నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారులపై కొరడా!
ABN , Publish Date - May 31 , 2024 | 03:48 AM
పౌరసరఫరాల శాఖలో ఇద్దరు జిల్లా అధికారులపై కమిషనర్ డీఎస్ చౌహాన్ కొరడా ఝుళిపించారు. నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎ్‌సవో) చంద్రప్రకాశ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు (డీఎం) జగదీశ్‌పై సస్పెన్షన్ వేటువేస్తూ కమిషనర్ చౌహాన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
డీఎ్‌సవో చంద్ర ప్రకాశ్, డీఎం జగదీశ్‌పై సస్పెన్షన్ వేటు
ఉత్తర్వులు జారీచేసిన కమిషనర్ డీఎస్ చౌహాన్
ధాన్యం కేటాయింపులు, బియ్యం సేకరణలో అక్రమాలతోనే
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల శాఖలో ఇద్దరు జిల్లా అధికారులపై కమిషనర్ డీఎస్ చౌహాన్ కొరడా ఝుళిపించారు. నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎ్‌సవో) చంద్రప్రకాశ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు (డీఎం) జగదీశ్‌పై సస్పెన్షన్ వేటువేస్తూ కమిషనర్ చౌహాన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ధాన్యం కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడటం, ఒక రైస్‌మిల్లు నుంచి ఇతర రైస్‌మిల్లులకు ధాన్యం బదిలీలు చేయటం, పౌరసరఫరాల సంస్థకు బియ్యం సేకరణలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. పౌరసరఫరాల భవన్‌కు ఫిర్యాదులు రావటంతో శాఖాపరమైన విచారణ జరిపించారు. విచారణలో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
నిజామాబాద్ జిల్లాలోని ఒక రైస్‌మిల్లు నుంచి ఐదు రైస్‌మిల్లులకు ధాన్యం బదిలీ చేసినట్లు రికార్డుల్లో చూపించారు. అయితే బదిలీ చేసిన రైస్‌మిల్లులో ధాన్యంలేదు. బదిలీ చేయించుకున్న ఐదు మిల్లుల్లోనూ ధాన్యంలేదు. కేవలం కాగితాలపైనే ధాన్యం బదిలీ చేసినట్లు రికార్డులున్నాయి. కాగా డిఫాల్టు రైస్‌మిల్లులు ఎక్కువగా నిజామాబాద్, సూర్యాపేట, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఉన్నాయి. రైస్ మిల్లర్లకు డీఎ్‌సవో, డీఎంలు సహకరించటంతోనే బియ్యం రికవరీ కావటంలేదని, మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని గుట్టుగా అమ్ముకుంటున్నారని, పీడీఎస్ బియ్యం రీ-సైక్లింగ్ జరుగుతున్నదని ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ డీఎ్‌సవో చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్‌పై కమిషనర్ వేటు వేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.