Share News

Telangana: ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం.. ఏడాది బాలుడు అదృశ్యం

ABN , Publish Date - Oct 19 , 2024 | 01:54 PM

ఆసుపత్రి ఆవరణలో గతరాత్రి బాలుడితో కలిసి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కి చెందిన వీరు.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు పేరు మణికంఠ అని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్‌తోపాటు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు.

Telangana: ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం.. ఏడాది బాలుడు అదృశ్యం

నిజామాబాద్, అక్టోబర్ 19: నగరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఈ ఆసుపత్రిలో ఏడాది వయసున్న బాలుడు కిడ్నాపునకు గురి కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఆసుపత్రితోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను వారు పరిశీలిస్తున్నారు. ఆ క్రమంలో బాలుడిని ముగ్గురు మహిళలు ఎత్తికెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.


మరోవైపు ఆసుపత్రి ఆవరణలో గతరాత్రి బాలుడితో కలిసి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కి చెందిన వీరు.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు పేరు మణికంఠ అని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్‌తోపాటు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపామని చెప్పారు.


ఇప్పటికే ఈ ఆసుపత్రిలో ఒక బాలుడు కిడ్నాప్ అయ్యాడని.. స్థానికులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆ ఘటన మరువక ముందే మరో బాలుడు కిడ్నాప్ కావడం పట్ల స్థానికులతోపాటు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు సైతం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ ఏడాదిలో ఈ కిడ్నాప్ ఘటన రెండోదని స్థానికులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.


జిల్లా ఆసుపత్రి అంటే.. వివిధ రకాల వైద్య సేవలుంటాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు వైద్య చికిత్స కోసం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాసుపత్రికి తరలి వస్తారని వారు పేర్కొంటున్నారు. అలాంటి వేళ.. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచడంతోపాటు రోగుల రక్షణకు చర్యలు తీసుకోవాలని రోగులతోపాటు స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

For Telangana News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 02:01 PM