RRR: గడువు ముగిసినా.. ఒక్క టెండరూ రాలే!
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:29 AM
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం రహదారికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచినా.. స్పందన రాలేదు.
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణం డీపీఆర్ తయారీలో పరిస్థితిదీ.. టెండర్లు రీకాల్.. జనవరి 20దాకా గడువు
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం రహదారికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచినా.. స్పందన రాలేదు. టెండర్లు ఎన్ని వచ్చాయనే అంశాన్ని పరిశీలించి, సంస్థను ఎంపిక చేయడం కోసం శనివారం ఉదయం అఽధికారులు టెండర్లను ఓపెన్ చేశారు. కానీ, వెబ్‌సైట్‌లో ఒక్క టెండరూ కనిపించలేదు. ‘ప్చ్ ఇదేంటి ఒక్క టెండరూ రాలేదు’ అని ఆ శాఖ అధికారులు సైతం ఆఽశ్చర్యపోయారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ సంస్థను ఎంపి క చేసేందుకు గత నవంబరు 25న ‘ఇంటర్నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్’ విధానంలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. టెండరు గడువు శుక్రవారం మధ్యాహ్నం 3గంటలతో ముగిసింది. నిబంధనల ప్రకారం శుక్రవారమే టెండర్లను పరిశీలించాల్సి ఉన్నా... దేశ మన్మోహన్‌సింగ్ మృతితో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో సాధ్యం కాలేదు.
దీంతో శనివారం ఉదయం టెండర్ల పరిశీలనకు అధికారులు పూనుకోగా.. ఒక్క టెండరూ రాకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. వాస్తవానికి డీపీఆర్ తయారీ కోసం నవంబరు 25న టెండర్లను ఆహ్వానించినప్పుడు దాఖలుకు చివరి తేదీని డిసెంబరు 16గా పేర్కొన్నారు. కానీ.. ప్రీ బిడ్ సమావేశంలో పలు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో టెండర్ గడువును డిసెంబరు 27వరకు పొడిగించారు. ఇప్పటికే ఒక సారి గడువు పెంచినా ఒక్క టెండరూ రాకపోవడంతో.. మరోసారి గడువును పెంచుతూ ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనవరి 20వరకు గడువును పొడిగించారు.