Share News

NRI Fraud: ఎన్‌ఆర్‌ఐ ఖాతా నుంచి 6.50 కోట్లు మాయం

ABN , Publish Date - Dec 10 , 2024 | 03:25 AM

ఆస్ట్రేలియాలో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐ బ్యాంక్‌ ఖాతా నుంచి ఆయనకు తెలియకుండానే సుమారు 6.5 కోట్ల రూపాయలను ఇతర ఖాతాలకు మళ్లించి బ్యాంకు సిబ్బంది కొల్లగొట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది.

NRI Fraud: ఎన్‌ఆర్‌ఐ ఖాతా నుంచి 6.50 కోట్లు మాయం

పంజాగుట్ట, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి ): ఆస్ట్రేలియాలో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐ బ్యాంక్‌ ఖాతా నుంచి ఆయనకు తెలియకుండానే సుమారు 6.5 కోట్ల రూపాయలను ఇతర ఖాతాలకు మళ్లించి బ్యాంకు సిబ్బంది కొల్లగొట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుని ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు యాక్సిస్‌ బ్యాంక్‌ బేగంపేట బ్రాంచ్‌ మాజీ మేనేజర్‌, సీనియర్‌ పార్టనర్‌తో పాటు మరో ఇద్దరు బ్యాంక్‌ సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో సిడ్నీ న్యూ సౌత్‌ వేల్స్‌కు చెందిన ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) పరితోష్‌ ఉపాధ్యాయ్‌కు 2017 నుంచి బేగంపేటలోని యాక్సిస్‌ బ్యాంక్‌లో ఖాతా ఉంది. అదే బ్యాంకులో సీనియర్‌ పార్టనర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ పాసర్లతో పరితోష్‌ తన ఖాతాకు సంబంధించి సంప్రదింపులు జరిపేవాడు.


వెంకటరమణ అదే బ్యాంకులో సర్వీస్‌ పార్టనర్‌ సురేఖ సైనీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరి విజయ్‌, మాజీ బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీదేవి రఘు, ఆపరేషన్స్‌ టీమ్‌తో కుమ్మక్కై పరితో్‌షకు తెలియకుండా లూజ్‌ లీఫ్‌ చెక్‌లను ఉపయోగించి, అతడి సంతకాన్ని ఫోర్జరీ చేసి అతని ఖాతాలో నగదును ఇతర ఖాతాలకు మళ్లించారు. పరితోష్‌ కొన్ని లావాదేవీలు చేయడానికి ప్రయత్నించినప్పుడు తన ఖాతాలో బ్యాలెన్స్‌ చాలా తక్కువగా ఉందని గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆ బ్యాంకు అధికారులను కలసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ సంవత్సరం అక్టోబరు 21న అతని ఖాతాను మూసివేస్తున్నారని మెయిల్‌ ద్వారా సమాచారం అందింది. దీంతో తన ఖాతాను దుర్వినియోగం చేశారని, చెక్కులపై సంతకాలు తనకు సంబంధించినవి కావని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Dec 10 , 2024 | 03:25 AM