Panjagutta: ‘విద్యుత్’పై అసత్య ప్రచారం చేస్తే ఖబడ్దార్
ABN , Publish Date - May 17 , 2024 | 03:51 AM
తెలంగాణ విద్యుత్ సంస్థలపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోమని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు. కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులు విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తూ సంస్థల ప్రతిష్ఠను మరింత దిగజారుస్తున్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు ఏ.శంకర్, సంయుక్త కార్యదర్శి డి.కోటేశ్వరరావు, జాతీయ ఓబీసీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు, రిటైర్డ్ సీజీఎం ఆళ్ల రామకృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు, రిటైర్డ్ అధికారులను సీఎండీలు, డైరెక్టర్లుగా నియమించి సంస్థను నిలువు దోపిడీ చేశారన్నారు. పదోన్నతులు, పోస్టింగుల్లో పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడ్డారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్లు కూడబెట్టారని ఆరోపించారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే కుట్రలు
సరఫరాకు సర్కారు ప్రాధాన్యత
కరెంటు కోతలు ఎక్కడా లేవు
గత ప్రభుత్వంలో సంస్థలు నాశనం
అధికారం అడ్డంపెట్టుకొని దోపిడీ
వారి ఆస్తులపై విచారణ జరిపించాలి
గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలు
పంజాగుట్ట, మే 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్ సంస్థలపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోమని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు. కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులు విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తూ సంస్థల ప్రతిష్ఠను మరింత దిగజారుస్తున్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు ఏ.శంకర్, సంయుక్త కార్యదర్శి డి.కోటేశ్వరరావు, జాతీయ ఓబీసీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు, రిటైర్డ్ సీజీఎం ఆళ్ల రామకృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు, రిటైర్డ్ అధికారులను సీఎండీలు, డైరెక్టర్లుగా నియమించి సంస్థను నిలువు దోపిడీ చేశారన్నారు. పదోన్నతులు, పోస్టింగుల్లో పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడ్డారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్లు కూడబెట్టారని ఆరోపించారు. వారి ఆస్తులపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి అవినీతికి పాల్పడ్డ వారి జాతకాలు వెలికితీసి శిక్షించాలన్నారు. దొడ్డిదారిన కారుణ్య నియామకాలు చేపట్టి అందినకాడికి దోచుకున్న వారిని వదిలిపెట్టవద్దన్నారు.
ప్రస్తుతం విద్యుత్ సంస్థల సంక్షోభానికి నాటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు అనుసరించిన విధానాలే కారణమన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కరెంట్ కోతలు లేవని, కానీ కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, హైదరాబాద్‌లోని మియాపూర్‌లో 220 కేవీ కేబుల్ కాలిపోవడం వెనుక వారి ప్రమేయం లేకపోలేదన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ ఇచ్చే గ్రేడింగ్‌లో 2014కు ముందు ఏ-గ్రేడులో ఉన్న విద్యుత్ సంస్థల రేటింగ్, ప్రస్తుతం సీ-గ్రేడ్‌కు పడిపోయిందని, ఇందుకు కారణం గతంలో ఇక్కడ పనిచేసిన సీఎండీలు, డైరెక్టర్లేనని ఆరోపించారు. 2014కు ముందు డిస్కంలకు నామమాత్రంగా ఉన్న ప్రభుత్వ బకాయిలు ప్రస్తుతం రూ.41 వేల కోట్లకు, విద్యుత్ సంస్థల మొత్తం అప్పులు రూ.1,63,583 కోట్లకు చేరడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో జీతాల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇస్తుంటే గత పాలకులు విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సరఫరాకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కడా లేవన్నారు. 2017లో గాంధీ ఆస్పత్రిలో కరెంట్ పోయి ఐదుగురు శిశువుల మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోకపోగా, ఆ తర్వాత వారిని అందలం ఎక్కించారని ఆరోపించారు. గతంలో విద్యుత్ సంస్థల్లో పనిచేసిన ఒక్కో అధికారి అవినీతితో కోట్లకు పడగలెత్తారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే విద్యుత్ సంస్థలు నిలబడుతాయన్నారు. గతంలో నాటి ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం కొంతమంది అసోసియేషన్ల నేతలు ఉద్యోగులకు ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసిన విషయం గుర్తు తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం కొంతమంది నేతల వ్యవహార శైలి గత పాలకులకు అనుకూలంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.