Share News

Hyderabad: గత ఏడాది 406 మంది రైతుల ఆత్మహత్య

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:27 AM

ప్రభుత్వాలు ఎన్నిరకాల సహాయాలను అందించినా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు.

Hyderabad: గత ఏడాది 406 మంది రైతుల ఆత్మహత్య

  • కాంగ్రెస్‌ వచ్చిన 7 నెలల్లో 158 మంది

  • 2018లో రైతు బీమా వచ్చిన తర్వాత ఎక్స్‌గ్రేషియా నిలిపివేసిన ప్రభుత్వం

  • రైతు స్వరాజ్య వేదిక నివేదిక వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు ఎన్నిరకాల సహాయాలను అందించినా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. రైతుబంధు వంటి పథకాలను అమలు చేసినా బలవన్మరణాలు చోటుచేసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆత్మహత్యలు ఆగడం లేదు. ఒక్క 2023లోనే తెలంగాణలో 406 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబరు 7 నుంచి 158 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని రైతు స్వరాజ్య వేదిక(ఆర్‌ఎ్‌సవీ) రూపొందించిన నివేదిక వెల్లడించింది.


ఈ ఏడు నెలల కాలంలో ఎక్కువగా ఆదిలాబాద్‌, జయశంకర్‌-భూపాలపల్లి, సిద్దిపేట, జనగామ్‌, మెదక్‌ జిల్లాల్లోనే ఆత్మహత్యలు నమోదయ్యాయి. 2023 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంక రికార్డుల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) ఇంకా వివరాలు వెల్లడించకపోరునా ఆర్‌సీవీ నివేదిక ప్రకారం 2014 నుంచి 2023 వరకు మొత్తం 7,064 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం 1995 నుంచి 2013 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 36,358మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో 60 శాతం తెలంగాణ ప్రాంతంలో చోటుచేసుకున్నవే. ఇందులో 6,974 మంది మహిళా రైతులు.


ఇది మొత్తం ఆత్మహత్యల్లో 19.18 శాతం కాగా.. జాతీయ సగటు 15 శాతం కంటే ఇది ఎక్కువ. బీటీ కాటన్‌ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత 2004 నుంచి 2006 వరకు ఈ ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. తెలంగాణ వచ్చాక 2014 నుంచి 2022 వరకు 6,658 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 756మంది(14.4 శాతం) మహిళా రైతులు. బవన్మరణాల్లో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ 11 శాతంతో వరుసగా రెండేళ్లు (2014, 2015) దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2015లో దేశవ్యాప్తంగా 441 మంది మహిళా రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. అందులో తెలంగాణకు చెందినవారే 153 మంది ఉండడం ఆందోళనకరం. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం 2019నుంచి రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గినట్లు కనిపించినా.. ఆగలేదు. ప్రభుత్వం తప్పుడు వివరాలు అందజేయడంతోనే సంఖ్య తక్కువగా నమోదయ్యిందన్న ఆరోపణలున్నాయి.


  • సగటున 19.96% మందికే ఎక్స్‌గ్రేషియా

ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 19.96 శాతం మంది కుటుంబాలకే ఎక్స్‌గ్రేషియా అందింది. 2018 రైతు బీమా పథకం ప్రారంభించిన తర్వాత ఈ ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం కూడా నిలిచిపోయింది. రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము అందజేస్తుండడంతో ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదు. రైతుల ఆత్మహత్యల పూర్తి వివరాలను కూడా ఎన్‌సీఆర్‌బీకి ఇవ్వకుండా దాచిపెడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Sep 29 , 2024 | 04:27 AM