M. Kumar: 12లక్షల ఇంజనీర్లకు 20శాతమే ఉపాధి!
ABN , Publish Date - Dec 03 , 2024 | 04:30 AM
దేశవ్యాప్తంగా ఏడాదికి 12 లక్షల ఇంజనీర్లను విద్యాసంస్థలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ... సుస్థిర నైపుణ్యం, అవగాహన కలిగిన 20 శాతం మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ తెలిపారు.
నూతన ఆవిష్కరణలతోనే అవకాశాలు: వీసీ ఎం. కుమార్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఏడాదికి 12 లక్షల ఇంజనీర్లను విద్యాసంస్థలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ... సుస్థిర నైపుణ్యం, అవగాహన కలిగిన 20 శాతం మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ తెలిపారు. విద్యాసంస్థలు, పరిశ్రమల అనుసంధానంతో నూతన ఆవిష్కరణలతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని తెలిపారు. సమాజ అవసరాలకు అనుగుణంగా సాంకేతికత అభివృద్థి చెందినప్పుడే పరిశోధనల లక్ష్యం నెరవేరుతుందని వివరించారు. శనివారం ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ సెమి కండక్టర్ ఐసి డిజైన్ ఇన్ ఇండియన్ పర్స్పెక్టివ్’ అనే అంశంపై జరిగిన సదస్సుకు కుమార్ హాజరై ప్రసంగించారు. ఈసీఈ చదివేవారికి చిప్ డీజైన్, సెమీ కండక్టర్ రంగంలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయన్న ఆయన.. ప్రస్తుతం 3 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశముందని చెప్పారు.
పరిశ్రమలు, విద్యాసంస్థల అనుసంధానానికి ఉన్న పరిమితులను, సమస్యలను గుర్తించి పరిష్కరిస్తే ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చునని స్పష్టం చేశారు. ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్థి చెందుతున్న దేశంగా కాకుండా త్వరలోనే అభివృద్థి చెందిన భారత్‌ను సాకారం చేసుకునేందుకు పరిశోధకులకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల్లో వస్తున్న నూతన ఆవిష్కరణలను వాణిజ్య మార్కెట్‌కు అందించాలని ఈసీఐఎల్ శాస్త్రవేత్త డాక్టర్ అనీష్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో ఓయూ ఇంజనీరింగ్ కశాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పీ. చంద్రశేఖర్, ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ డీ రామకృష్ణ, ఎలక్ర్టానిక్స్ రంగంలో పనిచేస్తున్న పలువురు నిపుణులు పాల్గొన్నారు.