Share News

Osmania Hospital: గుండెను పరీక్షించలేని ఉస్మానియా

ABN , Publish Date - Dec 16 , 2024 | 04:43 AM

రాష్ట్రంలోనే పెద్దాసుపత్రిగా పేరొందిన ఉస్మానియా వైద్యశాల గుండె పనితీరును పరీక్షించలేని స్థితికి చేరింది. ఆస్పత్రిలోని ఈసీజీ(ఎలకో్ట్ర కార్డియో గ్రామ్‌) యంత్రాలు కొద్ది నెలలుగా పని చేయడం లేదు.

Osmania Hospital: గుండెను పరీక్షించలేని ఉస్మానియా

పెద్దాస్పత్రిలో పని చేయని ఈసీజీ యంత్రాలు.. మొత్తం 14 యంత్రాల్లో 13 మొరాయింపు

  • నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు

  • దవాఖానలో రోజుకు కనీసం 450 పరీక్షలు

  • ప్రస్తుతం ఆస్పత్రి మొత్తానికి ఒక్క యంత్రమే దిక్కు

మంగళ్‌హాట్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే పెద్దాసుపత్రిగా పేరొందిన ఉస్మానియా వైద్యశాల గుండె పనితీరును పరీక్షించలేని స్థితికి చేరింది. ఆస్పత్రిలోని ఈసీజీ(ఎలకో్ట్ర కార్డియో గ్రామ్‌) యంత్రాలు కొద్ది నెలలుగా పని చేయడం లేదు. మొత్తం 14 ఈసీజీ యంత్రాల్లో 13 యంత్రాలు వేర్వేరు కారణాలతో మూలకు చేరగా.. ఒకేఒక్కటి పని చేస్తోంది. ఆస్పత్రి మొత్తానికి ప్రస్తుతం ఆ యంత్రమే దిక్కు అయింది. ఏడాదిగా ఈసీజీ యంత్రాల సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో సకాలంలో వైద్యం అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు.


  • పేరుకే 14 ఈసీజీ యంత్రాలు

గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, మధుమేహం, మూర్ఛ వంటి సమస్యలతో బాధపడుతున్న వారి గుండె పని తీరును తెలుసుకునేందుకు వైద్యులు ఈసీజీ పరీక్ష సిఫారసు చేస్తుంటారు. అలాగే, ఎవరైనా రోగికి శస్త్ర చికిత్స చేసే ముందు కూడా ఈసీజీ తప్పనిసరి. ఈసీజీ నివేదిక ఆధారంగానే వైద్యులు చికిత్స విషయంలో నిర్ణయం తీసుకుంటుంటారు. ఇంత కీలకమైన ఈ పరీక్షను చేసేందుకు ఉస్మానియాలో 14 ఈసీజీ యంత్రాలు ఉన్నాయి. ఔట్‌ పేషంట్‌, ఇన్‌ పేషంట్‌, ఐసీయూ, శస్త్రచికిత్సల ముందు కలిపి ఉస్మానియా వైద్యులు రోజూ 450 మందికిపైగా రోగులకు ఈసీజీ సిఫారసు చేస్తుంటారు. కానీ ఉన్న 14 యంత్రాల్లో 4 గతేడాది చెడిపోయాయి. 10 యంత్రాలు మిగలగా ఓపీలో రెండు, ఐపీలో రెండు, వేర్వేరు అత్యవసర విభాగాల్లో ఆరింటిని పెట్టి రోగులకు పరీక్షలు చేసేవారు. అయితే, మిద్రా, అలెన్‌ అనే కంపెనీలకు చెందిన నాలుగు ఈసీజీ యంత్రాలు, ఈడెన్‌ కంపెనీకి చెందిన మరో యంత్రం 4 నెలల క్రితం పాడైపోయాయి. ఆ తర్వాత నెల మరో రెండు ఈసీజీ యంత్రాలు కేబుళ్లలో సమస్యతో పని చేయడం మానేశాయి. దీంతో ఆయా యంత్రాలకు మరమ్మతులు చేయించాలని కోరుతూ ఈసీజీ విభాగం నుంచి సెప్టెంబరు 13న సూపరింటెండెంట్‌కు లేఖ వెళ్లింది. కానీ ఎలాంటి స్పందన లేదు. ఇక, అలెడ్‌ కంపెనీకి చెందిన రెండు యంత్రాలు గత వారం పాడైపోయాయి. దీంతో డిసెంబరు 4న ఈసీజీ విభాగం సిబ్బంది ఉన్నతాధికారులకు మళ్లీ లేఖ రాశారు. స్పందించిన ఉన్నతాధికారులు.. సదరు కంపెనీ ప్రతినిధుల ఫోన్‌ నెంబర్లను ఇచ్చి వారితో మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారు. చివరకు మిగిలిన ఒక్క ఈసీజీ యంత్రాన్నే ప్రస్తుతం వినియోగిస్తున్నారు.


ఈసీజీ గది వద్ద రోగుల పడిగాపులు

ఆస్పత్రి మొత్తానికి ప్రస్తుతం ఒకేఒక్క ఈసీజీ యంత్రం ఉండడంతో ఓపీ భవనంలోని ఈసీజీ రూమ్‌ 113 వద్ద వారం రోజులుగా రద్దీ పెరిగిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా రోగులు తమ వంతు కోసం అక్కడ పడిగాపులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. కాగా, ఈ విషయమై ఉస్మానియా రేడియాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ నదీమ్‌ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేష్‌ సహాయ్‌ వివరణ కోరగా.. ఆరు, ఏడు యంత్రాలు పనిచేస్తున్నాయని, పాడైన యంత్రాలను బాగుచేయిస్తున్నామని చెప్పారు.


యంత్రం లేదని గదికి తాళం వేశారు

మా అబ్బాయికి మూర్ఛ రావడంతో ఉస్మానియాకు తీసుకొచ్చా. ఈసీజీ చేయించమని డాక్టర్‌ చెప్పారు. ఉదయం నుంచి గంటల తరబడి ఈసీజీ గది వద్దే ఉన్నాం. యంత్రం లేదని గదికి తాళం వేశారు. ఎవరిని అడిగినా సిబ్బంది వస్తారు ఈసీజీ చేస్తారనే సమాధానమే చెప్పారు

- రిహాన (ఓ రోగి తల్లి)

Updated Date - Dec 16 , 2024 | 04:43 AM