Share News

అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:58 AM

అల్లు అర్జున్‌ వల్ల చనిపోయిన రేవతి కుటుంబానికి.. ఆయన తక్షణమే కోటి రూపాయలు చెల్లించాలని ఓయూ జేఏసీ డిమాండ్‌ చేసింది.

అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి

  • ముట్టడించిన ఓయూ జేఏసీ

  • పూలకుండీల ధ్వంసం

  • జేఏసీ నేతల అరెస్టు దాడిని ఖండిస్తున్నా: సీఎం

బంజారాహిల్స్‌/బోరబండ, డిసెంబరు 22 (ఆంఽధ్రజ్యోతి): అల్లు అర్జున్‌ వల్ల చనిపోయిన రేవతి కుటుంబానికి.. ఆయన తక్షణమే కోటి రూపాయలు చెల్లించాలని ఓయూ జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకొని ఆదివా రం నిరసన వ్యక్తం చేశారు. ‘అల్లు అర్జున్‌ డౌన్‌ డౌన్‌’ అంటూ పెద్ద పెట్టు న నినాదాలు చేశారు. ఆయన ఇంట్లోకి చోచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న అల్లు అర్జున్‌ వ్యక్తిగత సిబ్బంది వారిని అడ్డుకోవడంతో కొద్దిపాటి తోపులాట చోటు చేసుకుంది. ఓయూ జేఏసీ ప్రతినిధులు అర్జున్‌ ఇంటిపై టొమాటోలు విసరడంతో పాటు గేటులోపల ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.


ఆ సమయంలో జేఏసీ నేతలు.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్‌ను మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తరలించాలని డిమాండ్‌ చేశారు. అల్లు అర్జున్‌ స్పందించి రేవతి కుటుంబాన్ని ఆదుకోక పోతే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పట్ల అల్లు అర్జున్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం వల్లే పూల కుండీలు పగలకొట్టినట్టు వెల్లడించారు. ఈ ఆందోళనలో బైరు నాగరాజు గౌడ్‌, రెడ్డి శ్రీను ముదిరాజ్‌, బోణాల నగేష్‌ తదితరులు పాల్గొన్నారు. వీరిలో రెడ్డి శ్రీనివాస్‌ కొడంగల్‌ నియోజకవర్గం యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా.. జేఏసీ నేతలపై అల్లు అరవింద్‌ ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. అందరూ సంయమనం పాటించాలని అల్లు అరవింద్‌ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. సీఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్‌ వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలని బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్ధీన్‌ డిమాండ్‌ చేశారు. సైట్‌-3 అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అల్లు అర్జున్‌ దిష్టి బొమ్మను కాంగ్రెస్‌ కార్యకర్తలు దహనం చేశారు.


సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నా: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అల్లు అర్జున్‌ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి నేపథ్యంలో సీఎం రేవంత్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని ట్వీట్‌ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్నీ సహించేది లేదని హెచ్చరించారు. సంధ్య థియేటర్‌ ఘటనతో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించడం తగదని, అలా ఎవరూ స్పందించకుండా ఉండేలా పోలీసు ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Updated Date - Dec 23 , 2024 | 03:58 AM