Share News

Land Disputes: పెండింగ్‌ కేసులు.. సాగదీతే!

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:00 AM

ప్రభుత్వం- ప్రైవేట్‌ పార్టీలు, రైతులు- రెవెన్యూ శాఖకు మధ్య తలెత్తిన భూ వివాదాలకు సంబంధించిన వేల కేసులు కోర్టుల్లో సంవత్సరాల తరబడి మూలుగుతున్నాయి.

Land Disputes: పెండింగ్‌ కేసులు.. సాగదీతే!

  • కోర్టుల్లో భూ సమస్యలపై 25 వేలకుపైగా కేసులు

  • సివిల్‌ కోర్టుల్లో 66ు భూ వివాదాలే..

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం- ప్రైవేట్‌ పార్టీలు, రైతులు- రెవెన్యూ శాఖకు మధ్య తలెత్తిన భూ వివాదాలకు సంబంధించిన వేల కేసులు కోర్టుల్లో సంవత్సరాల తరబడి మూలుగుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం వివిధ కోర్టుల్లో 25 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సివిల్‌ కోర్టుల్లో ఉన్న వివాదాల్లో 66ు కేసులు కేవలం భూ వివాదాలవే. గత 80 ఏళ్లుగా భూ సర్వే చేపట్టకపోవడంతో భూ వివాదాలకు అంతే లేకుండా పోయింది. దీనికి తోడు తరచూ ఆర్వోఆర్‌ చట్టాల్లో మార్పులు చేయడం, కొత్త విధానాల వల్ల తలెత్తే వివాదాలు అదనంగా చేరుతున్నాయి. 2020లో ఆర్వోఆర్‌ అమల్లోకి వచ్చాక రికార్డుల్లో చిన్న పాటి సవరణలకు, తప్పులను సరిదిద్దుకోవాలన్నా సివిల్‌ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులు, న్యాయ అవగాహన లేని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


  • గ్రామాల్లో 2% భూమి కోర్టు కేసుల్లోనే

రాష్ట్రంలో 10894 రెవెన్యూ గ్రామాలుండగా, ప్రతి గ్రామంలో దాదాపు 200 భూ సమస్యలున్నాయి. గ్రామాల్లో ప్రస్తుత భూమిలో 2ు భూమి కోర్టు కేసుల్లో ఉండగా, 40ు భూమి ఇతరత్రా వివాదాలతో ముడిపడి ఉంది. గత ఏడాది కాలంలో భూసమస్యల మీద రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారులకు వచ్చిన దరఖాస్తులు 12 లక్షలు ఉన్నాయని ధరణి కమిటీ తన నివేదికలో పేర్కొందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 90ు మంది రైతులు రక్షణ లేని హక్కులు కలిగి ఉన్నారని, రికార్డుల్లో పేరు ఉంటే చేతిలో భూమి లేని వారు, భూమి అనుభవంలో ఉంటే రికార్డుల్లో పేర్లు లేనివారు, టైటిల్‌ లేని కుటుంబాలు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం ప్రకారం భూములు పొందినా సుమారు లక్ష మంది గిరిజనులకు టైటిల్‌ లేదు. అటవీశాఖ, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదంలో సుమారు 4 లక్షల ఎకరాల భూమి ఉండిపోయింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు భూమిలేని నిరుపేదలకు 25 లక్షల ఎకరాలను పంచగా అందులోనూ అనేక వివాదాలు ఉండటంతో ఆ భూములను అనుభవించలేని కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. పేదల భూములు అత్యధికంగా వివాదాల్లో ఉన్నాయి. దీని వల్ల ప్రభుత్వం అనుకున్న లక్ష్యం కూడా నెరవేరడం లేదు.


  • 129 కేసులు.. విలువ 2వేల కోట్లకు పైనే

రాష్ట్రంలో భూ ఆక్రమణలకు సంబంధించినవే వివిధ కోర్టుల్లో 129 కేసులున్నాయి. కేసులు నమోదయ్యే నాటికి వీటి విలువ రూ.1319 కోట్లు ఉండగా ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.2 వేల కోట్లకు పైగానే ఉంటుందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. 2016లో భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేయడంతో ఆ రోజు వరకు ఈ చట్టం కింద నమోదైన కేసుల వివరాలను ఇటీవల ప్రభుత్వం తెప్పించుకుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోనే సుమారు రూ.1000 కోట్ల విలువైన భూములు భూ ఆక్రమణల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో ఉన్నాయి.

Updated Date - Nov 25 , 2024 | 03:00 AM