Share News

Gandhi Hospital: వైద్య విద్యార్థినిపై రోగి దాడి..

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:42 AM

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న వైద్య విద్యార్థిని(జూనియర్‌ డాక్టర్‌)పై చికిత్స కోసం వచ్చిన ఓ రోగి దాడి చేశాడు.

Gandhi Hospital: వైద్య విద్యార్థినిపై రోగి దాడి..

  • మద్యం మత్తులో జూనియర్‌ డాక్టర్‌తో

  • అసభ్య ప్రవర్తన.. నిందితుడి అరెస్టు

  • గాంధీ ఆస్పత్రిలో ఘటన

బౌద్ధనగర్‌, అడ్డగుట్ట, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న వైద్య విద్యార్థిని(జూనియర్‌ డాక్టర్‌)పై చికిత్స కోసం వచ్చిన ఓ రోగి దాడి చేశాడు. చేయి, యాప్రాన్‌ను గట్టిగా లాగడంతో జూనియర్‌ డాక్టర్‌ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన తోటి వైద్యులు, సిబ్బంది.. ఆమెను విడిపించారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటకు చెందిన ఐ.ప్రకాశ్‌(60) రోజుకూలీ. కల్లు, మద్యానికి బానిసయ్యాడు. బుధవారం పూటుగా తాగి.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించటంతో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అతణ్ని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చి, అత్యవసర విభాగానికి తరలించారు.


ఈ సమయంలో.. ప్రకాశ్‌ తన భార్య పక్కనే నిలబడ్డ వైద్యవిద్యార్థిని చేయిపట్టుకున్నాడు. ఆమె యాప్రాన్‌ను లాగాడు. ఆమెను బయటకు ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో.. తోటి వైద్యులు, సిబ్బంది నిందితుడి నుంచి బాధితురాలిని విడిపించారు. ఈ దృశ్యాలు ఆస్పత్రిలోని సీసీకెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, చిలకలగూడ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో మతిస్థిమితం కోల్పోయి ఇలా దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజకుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.


  • కఠిన చర్యలు తీసుకోండి: జూడాలు

ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని జూనియర్‌ వైద్యుల సంఘం గాంధీ యూనిట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీ కృష్ణ డిమాండ్‌ చేశారు. జూనియర్‌ డాక్టర్లు ఈ మేరకు సూపరింటెండెంట్‌ను కలిసి, వినతిపత్రం సమర్పించారు.

Updated Date - Sep 12 , 2024 | 03:42 AM