Lok Sabha Elections: అన్నా.. ఎవరు గెలుస్తరే..?
ABN , Publish Date - May 16 , 2024 | 01:41 PM
ప్రభుత్వ కార్యాలయాలు.., ప్రైవేట్ సంస్థలు.., నలుగురు ఎక్కడ కలిసినా ఒకటే చర్చ. అన్నా, ఎన్నికలు ఎలా జరిగాయి..? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలువబోతున్నారు..? ఏ పార్టీకి ఎన్ని స్థానాలొస్తాయి..? సాధారణ పౌరుల నుంచి ఉన్నతాధికారుల వరకు రాజకీయాలపై ఆసక్తి ఉన్న చాలామంది ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్, మే 16: ప్రభుత్వ కార్యాలయాలు.., ప్రైవేట్ సంస్థలు.., నలుగురు ఎక్కడ కలిసినా ఒకటే చర్చ. అన్నా, ఎన్నికలు ఎలా జరిగాయి..? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలువబోతున్నారు..? ఏ పార్టీకి ఎన్ని స్థానాలొస్తాయి..? సాధారణ పౌరుల నుంచి ఉన్నతాధికారుల వరకు రాజకీయాలపై ఆసక్తి ఉన్న చాలామంది ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడ ఎవరు గెలిచే అవకాశముంది..? ఫలానా అభ్యర్థి పరిస్థితి ఏంటి..? ఏ నియోజకవర్గంలో ఏ పార్టీల మధ్య పోటీ ఉందన్నది చర్చిస్తున్నారు. ఇందులో కొందరు సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇంకొందరు తమకు తోచిన అభిప్రాయం చెబుతున్నారు. స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి మీ దగ్గర ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది..? మీరెవరికి ఓటు వేశారని తెలుసుకుంటున్నారు.
ప్రముఖులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల్లో ఫలితం ఎలా ఉండబోతుందన్న దానిపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో హోరాహోరీ పోరు ఉండడం.. సీనియర్ నేతలు పోటీ చేస్తుండడంతో గెలుపు ఎవరిదన్నది ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక ఏపీ ఎన్నికలు.. అక్కడి హింసాత్మక ఘటనలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలంటే ఇంత హింస జరుగుతుందా..? ఇదేం వైపరీత్యం అని పలువురు పేర్కొంటున్నారు. కేంద్రంలో ఏ కూటమికి అవకాశం ఉంది..? ఉత్తర భారతదేశంలో ఏ పార్టీకి సీట్లు ఎక్కువగా వస్తాయి..? ఎవరికి తగ్గుతాయి..? దక్షిణాదిన తీర్పు ఎలా ఉండబోతుందన్న దానిపై ఎవరికి వారు అభిప్రాయం వెల్లడిస్తున్నారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చర్చ జోరుగా సాగుతోంది.