BRS: హరీశ్‌రావు అరెస్ట్.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Sep 12 , 2024 | 07:49 PM
భాగ్యనగరం సాక్షిగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఈ క్రమంలో సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్: భాగ్యనగరం సాక్షిగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఈ క్రమంలో సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరికెపూడి గాంధీ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. న్యాయం చేసేవరకు సీపీ ఆఫీస్‌ను వదిలేది లేదని అక్కడే బైటాయించారు. చివరికి బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని శంషాబాద్ పీఎస్‌కు తరలించారు.
అయితే ఇవాళ మధ్యాహ్నం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విడుదల చేయడంపై బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అరెస్టు చేయకపోతే కోర్టుదాకా వెళ్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఏబీఎన్‌తో హరీశ్ ఏం మాట్లాడారంటే..
‘ మీ చర్యల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయింది. మా బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరిగాయా?. గాంధీపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దాడిపై సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?. ప్రజలకు రేవంత్ రెడ్డి ఇచ్చే సందేశం ఏంటి?. ఖమ్మంలో మాపై దాడి చేస్తే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా?.. లేదా?. కౌశిక్‌రెడ్డి ఇంటిపైకి దాడికి వస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చాం. సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. మీ చర్యల వల్ల హైదరాబాద్‌కు పెట్టుబడులు రావట్లేదు’ అని ఏబీఎన్ వేదికగా రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు కన్నెర్రజేశారు.