పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్..?
ABN , Publish Date - Nov 12 , 2024 | 04:56 AM
మెదక్ జిల్లాలో వరుస హత్యలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
వరుస హత్యలతో చిన్న శంకరంపేటలో కలకలం
చిన్నశంకరంపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లాలో వరుస హత్యలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పది రోజుల వ్యవధిలో ఇద్దరు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. అక్టోబరు 23న చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఓ హత్య జరిగింది. నవంబరు 3న మెదక్-చేగుంట రహదారికి ఆనుకొని ఉన్న పద్మనాభస్వామి గుట్ట వద్ద బస్టాండ్‌లో దుండగులు ఒకరిని చంపి, దహనం చేశారు. పది రోజుల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. చిన్నశంకరంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి హత్య కేసుల్లో జైలుకెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు. అతడు పోలీ్‌సస్టేషన్ వద్దకు రాగానే ముఖం కనబడకుండా రాకపోకలు సాగిస్తుండటాన్ని గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. అతడిపై 10కి పైగా హత్య కేసులు ఉన్నట్లు సమాచారం. మద్యం తాగి ఉన్మాదిలా మారి, పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులను హత్య చేసి, డబ్బులు దొంగిలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.