Share News

Investigation: కొకైన్‌ ఎక్కడిది!?

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:26 AM

మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలను మోకిల పోలీసులు 8 గంటలపాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దాదాపు 80 నుంచి వంద ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది.

Investigation: కొకైన్‌ ఎక్కడిది!?

  • రాజ్‌ పాకాలపై పోలీసుల ప్రశ్నల వర్షం

  • 8 గంటల్లో 80 నుంచి వంద ప్రశ్నలు

  • విజయ్‌ మద్దూరి ఫోన్‌పై ఆరా.. ఫామ్‌హౌజ్‌కు తీసుకెళ్లి తనిఖీలు

శంకర్‌పల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలను మోకిల పోలీసులు 8 గంటలపాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దాదాపు 80 నుంచి వంద ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది. దావత్‌కు ఎవరెవరు వచ్చారు? నుంచి మొదలుకుని పార్టీలోకి కొకైన్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశం వరకూ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా విజయ్‌ మద్దూరి ఫోన్‌ గురించి ఆరా తీశారు. ఫామ్‌హౌజ్‌ పార్టీ కేసులో రాజ్‌ పాకాలకు హైకోర్టు విధించిన గడువు బుధవారంతో ముగియడంతో ఆయన పోలీసు విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12.16 గంటలకు ఇద్దరు న్యాయవాదులతో వచ్చారు. నార్సింగి ఏసీపీ రమణ గౌడ్‌ పర్యవేక్షణలో ఆయనను న్యాయవాదుల సమక్షంలో విచారించారు. ఆయన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.


  • పోలీసులకు విజయ్‌ మద్దూరి ఝలక్‌

రాజ్‌ పాకాల ఫామ్‌హౌజ్‌లో పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పార్టీలో విజయ్‌ మద్దూరికి డ్రగ్స్‌ టెస్టు చేయగా.. ఆయన కొకైన్‌ తీసుకున్నట్లు నిర్ధ్దారణ అయిన విషయం తెలిసిందే. ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, ఫామ్‌హౌజ్‌లోనే విజయ్‌ను అదుపులోకి తీసుకోవడానికి ముందు ఆయన పోలీసులు తీసుకున్నారు. కానీ, ఆ సమయంలో విజయ్‌ పక్కనే ఆయన భార్య ఉన్నారు. ఆమె తనకు తెలిసిన ఓ మహిళ మొబైల్‌ను విజయ్‌ ఫోన్‌ అని చెప్పి పోలీసులకు అందజేశారు. అనంతరం స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విజయ్‌ను పంపేశారు. ఆ తర్వాత సదరు మహిళ వచ్చి తన ఫోన్‌ ఇవ్వాలంటూ పోలీసులను ఆశ్రయించారు.


ఈ నేపథ్యంలోనే, విజయ్‌ మద్దూరి తమకు ఫోన్‌ ఇవ్వని విషయాన్ని ప్రస్తావించారు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన ఫోన్‌ ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. ఆయన ఫోన్‌ విషయం తనకు తెలియదంటూనే ఫాంహౌజ్‌లో ఏమైనా పడిపోయిందేమోనని రాజ్‌ పాకాల సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. దాంతో, ఫోన్‌ వెతికేందుకు పోలీసులు మధ్యాహ్నం 3:11 గంటలకు రాజ్‌ పాకాలను ఆయన ఫాంహౌజ్‌కు తీసుకెళ్లారు. అక్కడ 4 బెడ్‌ రూముల్లో లాకర్లను తెరిపించి పరిశీలించారు. డిజిటల్‌ లాకర్లను కూడా తెరిపించి పరిశీలించారు. సుమారు గంటపాటు తనిఖీ చేసినా ఫోన్‌ దొరకలేదు. ఆయనను తిరిగి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రి 8.16 గంటల వరకూ మరోసారి విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని చెప్పి.. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తులో ఏర్పాటు చేశారు.


  • ఇంట్లో దావత్‌ చేసుకుంటే ఇంత రాద్దాంతమా!?

కొత్త ఇంటిని నిర్మించుకుని బంధువులు, స్నేహితులతో దావత్‌ చేసుకుంటే రాద్ధాంతం చేస్తున్నారని రాజ్‌ పాకాల ఆవేదన వ్యక్తం చేశారు. దావత్‌కు తమ కుటుంబ సభ్యులు హాజరయ్యారని, అక్కడ జరిగింది రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌ పార్టీ కాదని చెప్పారు. విజయ్‌ మద్దూరి ఎక్కడో డ్రగ్స్‌ తీసుకుని ఇక్కడ పరీక్షలో తేలితే తమకేం సంబంధమని ప్రశ్నించారు. పోలీసుల విచారణలో తాను ఆయనకు డ్రగ్స్‌ ఇచ్చినట్లు చెప్పలేదన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 04:26 AM