Ponguleti : అమృత్‌లో అవినీతి నిరూపిస్తే రాజీనామా!
ABN , Publish Date - Sep 22 , 2024 | 03:18 AM
అమృత్ పథకం నిధుల్లో రూ.8888 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ చేసిన ఆరోపణలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు.
నిరూపించకపోతే.. కేటీఆర్‌పై చట్టరీత్యా చర్యలు
రూ.8,888 కోట్ల అవినీతి ఎక్కడో చర్చిద్దాం
పోలింగ్ ముందురోజు టెండర్లు తెరిచింది మీరు
3 కంపెనీలకు 4ు అదనానికి కట్టబెట్టారు
మేం వచ్చాక రద్దుచేసి 2.44ు తక్కువకే ఖరారు
సృజన్‌రెడ్డి రేవంత్‌కు సొంత బావమరిది కాదు
బీఆర్‌ఎస్ సొంత మనిషి, కందాళ అల్లుడు
కేటీఆర్‌పై రెవెన్యూ మంత్రి పొంగులేటి ధ్వజం
హైదరాబాద్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): అమృత్ పథకం నిధుల్లో రూ.8888 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ చేసిన ఆరోపణలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆరోపణలు నిజమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అబద్ధమని తేలితే కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సచివాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో కంటే తక్కువ అంచనాలతో కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని చెప్పారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు ఎక్కడికైనా వస్తానని ప్రకటించారు. పరిపాలనా అనుమతి ఇచ్చిందే రూ.3516 కోట్లకు అని, పన్నులు, ఇతరత్రా కలిపినారూ.5385 కోట్లు అవుతుందని పొంగులేటి ప్రస్తావించారు. రూ.8,888 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. నేరుగా నిధులు మంజూరు చేసినట్లు ఉత్తర్వులు వచ్చాయా? అని ప్రశ్నించారు.
మిడిమిడి జ్ఞానంతో విమర్శలు చేయవద్దని హితవు పలికారు. పదేళ్ల పాటు అబద్దాలతో ప్రజలను వంచించారని, ప్రతిపక్షంలో కూడా అబద్దాలు ఆడితే ఈ హోదా కూడా పోతుందని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు పురపాలక మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ప్రస్తుత పురపాలక మంత్రి అయిన ముఖ్యమంత్రిపై దురుద్దేశ పూర్వకంగా తప్పుడు ఆరోపణలకు పాల్పడ్డారని, వాటిని నిరూపించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. పరువునష్టం దావా కూడా వేస్తామన్నారు. రాష్ట్రంలో 98 ప్రాంతాల్లో పనులు చేసేందుకు 2023 సెప్టెంబరు 20న గత ప్రభుత్వం టెండర్లు పిలిచిందని పొంగులేటి తెలిపారు. తెల్లవారితే పోలింగ్ ఉండగా నవంబరు 29న ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే రూ.3,515 కోట్ల బిడ్‌ను ప్రభుత్వం తెరిచిందని చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే లోపే 3.99 శాతం అదనానికి మూడు కంపెనీలకు కట్టబెట్టిందన్నారు. మూడింటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ అని, మరొకటి గజా కన్‌స్ట్రక్షన్, మూడోది మేఘా అని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రీ టెండర్లు
డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ టెండర్ల విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో వాటిని రద్దు చేసి.. పాత ఎస్‌ఎ్‌సఆర్ ధరల ప్రకారమే మళ్లీ టెండర్లు పిలిచామని పొంగులేటి వెల్లడించారు. కేఎన్‌ఆర్ జాయింట్ వెంచర్, ఇంకొకటి ఏఎమ్మార్ ఇండియా లిమిటెడ్, సోదా కంపెనీలకు టెండర్లు దక్కాయని వివరించారు. కేటీఆర్ ఆరోపించినట్లు సోదా కంపెనీ ఎండీ సృజన్‌రెడ్డి సీఎం సొంత బావమరిది కాదని తెలిపారు. గతంలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సలోకి మారినందుకు అల్లుడు సృజన్‌రెడ్డికి పాలమూరు-రంగారెడ్డి పనుల్లో రూ.2,300 కోట్ల విలువ జేసే 7వ ప్యాకేజీ పనులు బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు.
నిజానికి సృజన్‌రెడ్డి కేటీఆర్‌కే దగ్గరి మనిషి అన్నారు. సృజన్‌రెడ్డి మామ కందాళ ఉపేందర్‌రెడ్డి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పాలేరు నుంచి తన మీద పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో 3.99 శాతం అదనపు అంచనాలతో టెండర్లు పిలిస్తే తమ ప్రభుత్వం దాన్ని 2.44 శాతానికి తగ్గించి టెండర్లు ఖరారు చేసిందన్నారు. గత పాలకులు చేసిన దానికంటే రూ.57 కోట్లు తక్కువకే టెండర్లు ఇచ్చామన్నారు. వారికి టెండర్లు ఇచ్చేందుకు సీఎం ఎవరిని టెండర్లు వేయవద్దని కానీ, ఎవరిని బెదిరించింది కానీ లేదన్నారు. నిబంధనల మేరకే పనులు అప్పగించామన్నారు.