Share News

Ponguleti: నవంబరులోపు ఇందిరమ్మ ఇళ్లు..

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:04 AM

నవంబరు నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు.

Ponguleti: నవంబరులోపు ఇందిరమ్మ ఇళ్లు..

మొదటి విడతగా ఒక్కో నియోజకవర్గానికి 3500 కేటాయింపు

  • గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్‌ లోన్లనూ చెల్లిస్తాం

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

తిరుమలగిరి(సాగర్‌), అక్టోబరు 5: నవంబరు నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. మొదటి విడతగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బ్యాంకు లోన్లను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఆయా ఇళ్లపై హక్కు పత్రాలను అందజేస్తామని ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచేలా, అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త ఆర్‌వోఆర్‌ చట్టాన్ని త్వరలోనే తీసుకువస్తామని మంత్రి తెలిపారు.


కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం రూపకల్పన, అమలులో ఇబ్బందులను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌), రంగారెడ్డి జిల్లా యాచారం మండలాలను పైలట్‌ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి శనివారం తిరుమలగిరి(సాగర్‌) మండలంలో రైతులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుమలగిరి(సాగర్‌) మండలంలో 4,300 ఎకరాలు సర్వే చేస్తే 1,300 ఎకరాల్లో అనర్హులు పట్టాలు పొందారని వివరించారు. కాగా, డిసెంబరు 9న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇదే మండలంలో సుమారు 4వేల ఎకరాలకు అర్హులైన పేదలందరికీ పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఎల్పీ మాజీ నేత కందూరు జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 03:04 AM