RTC Workers: త్వరలో ఆర్పీఎస్ బకాయిలు రూ.200 కోట్లు
ABN , Publish Date - Aug 25 , 2024 | 03:31 AM
ఆర్టీసీ ఉద్యోగుల శ్రమ, కష్టాన్ని ప్రభుత్వం గుర్తించిందని, పెండింగ్‌లో ఉన్న రూ.200 కోట్ల ఆర్‌పీఎస్ బాండ్ డబ్బులను త్వరలో సిబ్బందికి అందించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం హామీ
ఉత్తమ సేవలకు ప్రగతిచక్ర అవార్డుల ప్రదానం
హైదరాబాద్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల శ్రమ, కష్టాన్ని ప్రభుత్వం గుర్తించిందని, పెండింగ్‌లో ఉన్న రూ.200 కోట్ల ఆర్‌పీఎస్ బాండ్ డబ్బులను త్వరలో సిబ్బందికి అందించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకంలో ఇప్పటివరకు 81 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుని, రూ.2,750 కోట్లు ఆదా చేసుకున్నారన్నారు.
శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళా భవన్‌లో నిర్వహించిన ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతిచక్ర అవార్డుల ప్రదానోత్సవ సభలో మంత్రి పొన్నం మాట్లాడారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొంటుందన్నారు. ఇప్పటికే 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ పీఎఫ్, సీసీఎస్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అత్యుత్తమ సేవలందించిన 124 మంది ఉద్యోగులకు పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ బస్టాండ్ అవార్డు ఖమ్మం నూతన బస్టాండ్‌కు, ఉత్తమ డిపో అవార్డు సత్తుపల్లి డిపోకు లభించాయి. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతంతో మరణించిన వరంగల్-2 డిపోకు చెందిన డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబ సభ్యులకు రూ.1.15కోట్ల బీమా చెక్‌ను మంత్రి పొన్నం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ అరుణ్ కుమార్, రీజనల్ హెడ్ సత్యం పలుగుల పాల్గొన్నారు.