Ponnam: మూసీ అభివృద్ధిపై విషప్రచారమా..?
ABN , Publish Date - Sep 28 , 2024 | 04:16 AM
మురికికూపంగా మారిన మూసీని అభివృద్ధి చేసి పూర్వవైభవం తేవాలని చూస్తుంటే కొన్ని శక్తులు విషప్రచారాలు చేస్తున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని సహించబోం..: పొన్నం
హైదరాబాద్/బేగంపేట, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మురికికూపంగా మారిన మూసీని అభివృద్ధి చేసి పూర్వవైభవం తేవాలని చూస్తుంటే కొన్ని శక్తులు విషప్రచారాలు చేస్తున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోషల్ మీడియా ద్వారా లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని ఉపేక్షించొద్దని.. కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీని ఆదేశించారు. శుక్రవారం సచివాలయం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. మూసీలో అక్రమ కట్టడాలున్నాయని గత బీఆర్‌ఎస్ సర్కారు కూడా ఒప్పుకుందని.. మూసీ నిర్వాసితులకు పది వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని స్వయంగా మాజీ మంత్రి కేటీఆరే చెప్పారని గుర్తు చేశారు.
ఇప్పుడు తాము అదే పని చేస్తుంటే పేదలకు అన్యాయం చేసినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మూసీ పరీవాహకంలో ఇళ్లు కట్టుకున్న వారికి తాము తగిన పరిహారం ఇచ్చి ఖాళీ చేయిస్తామన్నారు. ‘మా పాలనలో లోపాలుంటే మంత్రులు, అధికారులకు ఎత్తి చూపవచ్చు. లేదంటే ధర్నాచౌక్‌లో ఆందోళన చేయండి.. కానీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు’ అని హెచ్చరించారు. అంతకుముందు సచివాలయంలోని తన చాంబర్‌లో పొన్నం.. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు మందకొడిగా సాగుతుండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వేగంగా పనులు పూర్తి చేయాలని.. అవినీతికి ఆస్కారం లేకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు.
ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’..
గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధితో పని చేస్తోందని పొన్నం అన్నారు. ప్రజాభవన్‌లో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ‘ప్రవాసీ ప్రజావాణి’ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో కార్మికులు గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రవాసీ ప్రజావాణి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.