Ponnam Prabhakar: తప్పు చేయకుంటే భయమేల?
ABN , Publish Date - Dec 20 , 2024 | 03:27 AM
ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి ఏ తప్పూ చేయకపోతే.. విచారణకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇప్పుడు దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందనే భయంతోనే అసెంబ్లీలో చర్చించాలని అంటున్నారని మండిపడ్డారు.
తొలిసారి రేస్‌తో రూ.200 కోట్ల నష్టం
అందుకే ప్రమోటర్ మళ్లీ రాలే
తెలిసీ రూ.55 కోట్లిచ్చారు: పొన్నం
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి ఏ తప్పూ చేయకపోతే.. విచారణకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇప్పుడు దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందనే భయంతోనే అసెంబ్లీలో చర్చించాలని అంటున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై కేటీఆర్ ప్రెస్‌మీట్‌కు స్పందనగా.. పార్టీ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, విజయ రమణారావు, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పు జరగకపోతే ఏసీబీ ముందే కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన సూచించారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్‌లో మొదటిసారి నిర్వహించినప్పుడు నష్టం వచ్చిందని మంత్రి గుర్తుచేశారు. ‘‘ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెరిగిందా? లేదా? ట్యాంక్ బండ్, ఐమ్యాక్స్ చుట్టూ ఉన్నవారు ఇబ్బంది పడ్డారా? అనేది ప్రజలకు తెలుసు. దీనిపై గొప్పలు చెప్పుకుంటే తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలూ నవ్వుకుంటారు. మొదటిసారి ఫార్ములా ఈ రేస్‌తో భారీగా నష్టం జరగడంతో రెండోసారి ప్రమోటర్ కూడా ముందుకు రాలేదు.
ఇదంతా తెలిసినప్పటికీ హెచ్‌ఎండీఏ వైస్‌చైర్మన్‌గా ఉన్న కేటీఆర్ ఎందుకు రూ.55 కోట్లు చెల్లించారు? అది ప్రజాధనమని మరిచిపోయారా? లేక అవి ఆయన సొంత డబ్బులా?’’ అని దుయ్యబట్టారు. అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేయడంతో పాటు.. మళ్లీ అధికారంలోకి వస్తామనే అహంకారంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది నిజం కాదా అని నిలదీశారు. ‘‘హెచ్‌ఎండీఏ డబ్బును ఎవరి అనుమతీ లేకుండా వాడుకునే వీలుందా? డబ్బులు బదిలీ చేసేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారు? అప్పటి మంత్రివర్గంలో చర్చ జరిగిందా? అప్పటి ముఖ్యమంత్రి ఆమోదించారా? ఆర్థిక శాఖ అనుమతి ఉందా? అసలు ఎవరి అనుమతీ లేకుండా విదేశాలకు తెలంగాణ ప్రభుత్వం డబ్బును ఎలా బదిలీ చేసింది? నిబంధనలు పాటించాలనే కనీస ధర్మం పాటించవద్దా? ప్రజాధనమంటే అంత చులకనా? అక్టోబర్ 5, 11 తేదీల్లో ఎఫ్‌ఐఏకు డబ్బులు బదిలీ చేసినట్లు బాహాటంగా చెప్పుకుంటున్న కేటీఆర్‌కు అప్పుడు ఎన్నికల షెడ్యూలు విడుదలైన విషయం తెలియదా? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు డబ్బుల చెల్లింపులు చేయటం నేరం కాదా?’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు.
ఇదీ నేపథ్యం..
హైదరాబాదులో తొలుత ఫార్ములా రేస్ సీజన్ 9 జరిగింది. అదే వరుసలో ఫార్ములా రేస్ 10 నిర్వహణకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, అనుమతి లేకుండా చేసిన చెల్లింపులపై ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఈ రేసుల నిర్వహణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం, సీఎం ఆమోదం లేవని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీజన్ 9 నిర్వహణకు దాదాపు రూ.200 కోట్లు ఖర్చు కాగా.. అందులో రూ.150 కోట్లను హెచ్‌ఎండీఏకు ఫార్ములా రేస్ కంపెనీకి మధ్య మీడియేటర్‌గా వ్యవహరించిన నెక్ట్స్ జెన్ (గ్రీన్కో) అనే ప్రైవేటు సంస్థ ఖర్చు చేసి భారీగా నష్టపోయింది. అంటే.. కేటీఆర్ గొప్పలు చెప్పుకున్న ఫార్ములా రేస్‌తో నష్టం తప్ప హైదరాబాద్‌కు ఒక్క రూపాయి కూడా లాభం జరగలేదు. ఐమ్యాక్స్ సమీపంలో నిర్వహించిన రేస్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సచివాలయ పరిసరాల్లో కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. కానీ.. కేటీఆర్ సొంత ప్రయోజనాల కోసం రెండోసారి కూడా అదే రేసు నిర్వహణకు మొగ్గు చూపారు’’ అని పొన్నం దుయ్యబట్టారు. మొదటిసారి నష్టాలు రావటంతో సీజన్ 10 నిర్వహణకు గ్రీన్కో ముందుకు రాలేదని, స్పాన్సర్‌గా ఎవరూ ముందుకు రాకపోవడంతో హెచ్‌ఎండీఏ ఫార్ములా ఈ కంపెనీతో ఒప్పందానికి మొదట్లో వెనుకాడిందని.. కానీ, అప్పటికే రహస్య ఒప్పందం చేసుకున్న కేటీఆర్ రేస్ నిర్వహణకు డబ్బు చెల్లించాలని హెచ్‌ఎండీఏ అధికారులపై ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. మొదటిసారి నష్టపోయినా.. రెండోసారి స్పాన్సర్లు ముందుకురాకున్నా కేటీఆర్ తన సొంత లాభానికి ఈ ఫైలును ముందుకు నడిపారని ధ్వజమెత్తారు.