Hyderabad: ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి మాల్ స్వాధీనం..
ABN , Publish Date - May 17 , 2024 | 03:11 AM
అద్దె బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్ వద్దకు చేరుకున్న అధికారులు భవనానికి నోటీసులు అతికించి.. తాళం వేశారు. ఒప్పందం ప్రకారం విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ బాధ్యులు అద్దె చెల్లించనందు వల్ల హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్‌రెడ్డి మాల్‌ను స్వాధీనం చేసుకుంటున్నట్టు మైక్‌లో ప్రకటించారు. మాల్‌లో ఉన్న షాపుల యజమానులు సహకరించాలని కోరారు.
తాళం వేసిన టీఎస్‌ఆర్టీసీ అధికారులు
రూ.2.51కోట్లకు పైగా అద్దె బకాయి
చెల్లించకపోవడంతో చర్యలు
ఆర్మూర్ టౌన్/హైదరాబాద్, మే 16(ఆంధ్రజ్యోతి): అద్దె బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్ వద్దకు చేరుకున్న అధికారులు భవనానికి నోటీసులు అతికించి.. తాళం వేశారు. ఒప్పందం ప్రకారం విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ బాధ్యులు అద్దె చెల్లించనందు వల్ల హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్‌రెడ్డి మాల్‌ను స్వాధీనం చేసుకుంటున్నట్టు మైక్‌లో ప్రకటించారు. మాల్‌లో ఉన్న షాపుల యజమానులు సహకరించాలని కోరారు. 2013 జూన్1న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బస్టాండ్ సమీపంలో 7,059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ కింద 33 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. అయితే, 2017లో ఆ స్థలాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి టేకోవర్ చేసుకొని జీవన్‌రెడ్డి మాల్, మల్టీప్లెక్స్‌ను నిర్మించారు.
మాల్‌లోని పలు అంతస్తులను థర్డ్ పార్టీలకు లీజ్‌కు ఇచ్చారు. అయితే, గత అక్టోబరు నాటికే రూ.8.65కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో ఆర్టీసీ అధికారులు పలుమార్లు నోటీసులు అందజేశారు. దీంతో తొలివిడతలో 1.50కోట్లు, డిసెంబరులో 2.40కోట్లను ఆ సంస్థ నిర్వాహకులు చెల్లించారు. అనంతరం ఆర్టీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ గత ఏడాది డిసెంబరులో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో జనవరి, ఫిబ్రవరిలో రూ.2కోట్లను చెల్లించారు. మరో నెల రోజుల్లో మిగతా అద్దె చెల్లించాలని అప్పట్లోనే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు పూర్తయినా రూ.2.51కోట్ల అద్దె బకాయిలను సదరు సంస్థ చెల్లించలేదు. దీంతో ఈనెల 9వ తేదీన ఆర్టీసీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. అయినా నిర్వాహకులు స్పందించకపోవడంతో అద్దె ఒప్పంద నిబంధనల మేరకు విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి, జీవన్‌రెడ్డి మాల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.