నేడు, రేపు భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 23 , 2024 | 03:26 AM
తెలంగాణలో సోమ, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒకటి రెండు మినహా అన్ని జిల్లాల్లో వానలు పడే అవకాశముందని పేర్కొంది.
ఒకట్రెండు మినహా అన్ని జిల్లాలకు అలర్ట్
4 రోజులు రాష్ట్రమంతా కురిసే చాన్స్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): తెలంగాణలో సోమ, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒకటి రెండు మినహా అన్ని జిల్లాల్లో వానలు పడే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 26 వరకు రాష్ట్రానికి యెల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం, మయన్మార్ దక్షిణ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో రెండో ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఈ రెండు ఆవర్తనాల ప్రభావం వల్ల సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కొత్తూర్‌లో భారీ వర్షం..
రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో కొత్తూర్ సమీపంలోని అండర్‌పాస్ నీటితో నిండిపోయింది. హైదరాబాద్ నుంచి కొత్తూర్ వైపు వస్తున్న ఓ కారు ఆ నీటిలో చిక్కుకుపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని కారును బయటకు తీశారు. నీరు నిలిచిపోవడంతో అండర్‌పాస్ నుంచి రాకపోకలను నిలిపివేశారు.
పిడుగుపాటుకు ఇద్దరు బలి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు చనిపోయారు. వనపర్తి జిల్లా వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన గౌనికాడి గొల్ల పద్మమ్మ(35), నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లికి చెందిన నక్క నీలమ్మ(38) పశువులను మేపేందుకు వెళ్లి.. పిడుగుపాటుతో చనిపోయారు.