Hyderabad: 17న నగరానికి రాష్ట్రపతి ముర్ము
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:23 AM
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17న హైదరాబాద్‌కు రానున్నారు. 21వ తేదీ వరకు ఆమె ఇక్కడే ఉండనున్నారు. 17న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆమె నగరానికి చేరుకుంటారు.
శీతాకాల విడిది కోసం రాక
అల్వాల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17న హైదరాబాద్‌కు రానున్నారు. 21వ తేదీ వరకు ఆమె ఇక్కడే ఉండనున్నారు. 17న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆమె నగరానికి చేరుకుంటారు. 18, 19 తేదీల్లో రాష్ట్రపతి నిలయంలోనే ఉంటారు. 20న సికింద్రాబాద్ సైనిక్‌పురిలోని సీడీఎం కాలేజ్‌లో నిర్వహించే ‘కలర్స్ ప్రజెంటేషన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 4-5 గంటల మధ్య రాష్ట్రపతి నిలయంలో వివిధ రంగాల ప్రముఖులు, అధికారులతో కలిసి ఆమె తేనీటి విందులో పాల్గొంటారు.
21న ఉదయం కోఠి ఉమెన్స్ కళాశాలను సందర్శించి కళాశాల అవరణలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బేగంపేట్‌కు చేరుకొని ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, కంటోన్మెంట్ బోర్డు సీఈవోల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.