TG: ఎలివేటెడ్ కారిడార్లకు ‘భూసేకరణ’ షురూ
ABN , Publish Date - May 11 , 2024 | 06:54 AM
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ ప్రక్రియ షురూ అయ్యింది. ఓ వైపు సికింద్రాబాద్ నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా కండ్లకోయ వరకు, మరోవైపు సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట వైపు వచ్చే ఈ ఎలివేటెడ్ కారిడార్లకు రక్షణ శాఖ భూములే కీలకంగా మారాయి.
భూముల గుర్తింపునకు డిఫెన్స్, హెచ్‌ఎండీఏ సర్వే
‘కోడ్’ ముగిశాక టెండర్లు పిలిచేందుకు కసరత్తు
హైదరాబాద్ సిటీ, మే 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ ప్రక్రియ షురూ అయ్యింది. ఓ వైపు సికింద్రాబాద్ నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా కండ్లకోయ వరకు, మరోవైపు సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట వైపు వచ్చే ఈ ఎలివేటెడ్ కారిడార్లకు రక్షణ శాఖ భూములే కీలకంగా మారాయి. దాంతో తొలుత రక్షణ శాఖ భూములను గుర్తించేందుకు డిఫెన్స్, హెచ్‌ఎండీఏ అధికారులు సంయుక్తంగా సర్వే చేస్తున్నారు.
రెండు విభాగాలుగా విడిపోయిన అధికారులు ప్రస్తుతమున్న రోడ్డుకు మధ్య భాగం నుంచి ఇరువైపులా 30 మీటర్ల చొప్పున మొత్తం 60 మీటర్లు కొలతలు వేస్తున్నారు. ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కావడంతో పాటు సర్వీసు రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములను గురిస్తున్నారు. తొలుత రక్షణశాఖ భూములు చేతికందగానే ప్రైవేటు వ్యక్తులు భూములను సేకరించనున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియగానే ఎలివేటెడ్ కారిడార్లకు టెండర్లను పిలిచేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.