Share News

Vikarabad: లగచర్ల రణరంగం

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:01 AM

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం, దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించ తలపెట్టిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారింది.

Vikarabad: లగచర్ల రణరంగం

  • ఫార్మా కంపెనీ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తం

  • వ్యూహాత్మకంగా ఊర్లోకి రప్పించి అధికారులపై రాళ్లదాడి

  • వికారాబాద్‌ కలెక్టర్‌ జైన్‌, అదనపు కలెక్టర్‌పై ఆగ్రహం

  • కడా అధికారికి తీవ్ర గాయాలు, హైదరాబాద్‌ తరలింపు

  • కలెక్టర్‌, అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి

  • అంచనా వేయడంలో నిఘా, పోలీసు విభాగాల వైఫల్యం

  • దాడుల వెనుక ఓ పార్టీ హస్తం ఉన్నట్లు అనుమానం

  • ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు: ఐజీ సత్యనారాయణ

  • దాడి జరగలేదు.. ఆ పదాన్ని వాడొద్దు: వికారాబాద్‌ కలెక్టర్‌

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం, దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించ తలపెట్టిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారింది. రైతులతో మాట్లాడేందుకు తమ వాహనాలు దిగి సమావేశం జరిగే స్థలానికి వచ్చిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, కడా ప్రత్యేకాధికారులకు వ్యతిరేకంగా గోబ్యాక్‌, డౌన్‌ డౌన్‌ అంటూ రైతులు నినాదాలు చేస్తూ దూసుకెళ్లారు. జిల్లా కలెక్టర్‌ సహ అఽక్కడకు వచ్చిన అధికారులు.. మీ సమస్య, డిమాం డ్లు చెప్పాలంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహంతో ఊగిపోయారు. అప్పటికీ అధికారులు సంయమనం కోల్పోకుండా రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా... సమావేశానికి వచ్చిన రైతులు, ప్రజలు ఆగ్రహంతో అధికారులపైకి దూసుకువచ్చారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, తాండూ రు సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలను ముం దుకు తోస్తూ చాలా దురుసుగా వ్యవహరించారు. తమ ఎదురుగా ఉన్నది కలెక్టర్‌ అనీ కూడా చూడకుండా రణరంగం సృష్టించారు.


ఊహించని పరిణామానికి అధికారులు, వారి వెంట వచ్చిన సిబ్బంది హాహాకారాలు, రైతుల ఆగ్రహావేశాలు, దూషణలతో లగచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణ చేపట్టేందుకు సోమవారం దుద్యాల మండలం, లగచర్లలో సమావేశం ఏర్పాటు చేశారు. భూములు కోల్పోతున్న పోలెపల్లి, హకీంపేట్‌, పులిచర్ల కుంట తండా, రోటిబండ తండా, లగచర్ల గ్రామాల రైతులు సమావేశాన్ని బహిష్కరించి.. నిరసనగా లగచర్లలోనే ఉండిపోయారు. సమావేశం ఏర్పాటు చేసిన స్థలం వద్దకు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, ఇతర అధికారులు వెళ్లగా అక్కడ కొందరు రైతులు మాత్రమే ఉన్నారు. రైతులు ఎక్కడున్నారని అక్కడున్న వారిని ప్రశ్నించగా, రైతులందరూ లగచర్ల గ్రామంలో ఉన్నారు, అక్కడికి వచ్చి మాట్లాడాలంటూ లగచర్లకు చెందిన బోగమోని సురేశ్‌తో పాటు అక్కడున్న మరికొందరు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్‌ అధికారులతో కలిసి లగచర్లకు వాహనాల్లో చేరుకున్నారు. అధికారులు వాహనాల్లో నుంచి దిగుతుండగానే అక్కడున్న రైతులు ఒక్కసారిగా కలెక్టర్‌ డౌన్‌, డౌన్‌, కలెక్టర్‌ గో బ్యాక్‌.. అంటూ నినాదాలు చేశారు. రైతుల ఆగ్రహాన్ని గుర్తించిన కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఇతర అఽధికారులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుండగా, వినిపించుకోకుండా అధికారులపైకి దూసుకువచ్చారు. అధికారులు చెప్పేది వినిపించుకోకుండా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీంతో డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి వెంటనే అప్రమత్తమై కలెక్టర్‌ను చాకచక్యంగా అక్కడి నుంచి కారులో పంపించేశారు.


కోపోద్రిక్తులైన రైతులు అక్కడే ఉన్న కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై పిడిగుద్దులు కురిపిస్తూ కింద పడేసి పలుమార్లు దాడి చేశారు. అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డిపై రైతులు దాడి చేయగా, వారికి స్వల్ప గాయాలయ్యాయి. అధికారులను పోలీసులను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నంలో కోపోద్రిక్తులైన రైతులు అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడిచేసి ధ్వంసం చేశారు. తన వెంట పడ్డ రైతుల నుంచి రక్షించుకునేందుకు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి సమీపంలోని పొలాల్లోకి పరుగులు తీసి సొమ్మసిల్లి పడిపోయారు. అయినా రైతులు కనికరించకుండా ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు, ప్రత్యేక బలగాలు ఆయన్ను తప్పించి.. కొడంగల్‌కు తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పరిశీలించి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. కాగా దాడి వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టేప ప్రసక్తేలేదని ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించి న అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామ ని ఐజీ సత్యనారాయణ చెప్పారు. ఈ దాడికి సంబంధించి 3ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వెల్లడించారు.


  • సూత్రదారి ఆయనే?

లగచర్ల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేస్తే.. గ్రామానికి వచ్చి రైతులతో మాట్లాడాలని కోరిన వ్యక్తులే.. దాడి ఘటనకు ప్రధాన సూత్రధారులని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన వెనక ఓ రాజకీయ పార్టీ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించేలా స్కెచ్‌ వేశారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా అధికారులపై దాడి చేసే అవకాశం ఉందని స్థానిక పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా... మన రైతులు దాడి చేసే ప్రయత్నం చేయరనే ఉద్దేశంతో అధికారులు రైతుల వద్దకు వెళ్లారు. అయితే రైతుల ముందస్తు వ్యూహాన్ని అంచనా వేయడంలో నిఘా విభాగం వైఫల్యం చెందిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- ఆంధ్రజ్యోతి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా న్యూస్‌నెట్‌వర్క్‌

ధర్నా, నిరసనలొద్దు: కలెక్టర్‌

దాడి ఘటనపై కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ స్పందించారు. కలెక్టరేట్‌ ఉద్యోగులు ధర్నా, నిరసన కార్యక్రమాలేవీ చేయొద్దని సూచించారు. ‘‘లగచర్ల గ్రామస్థులు మాట్లాడటానికి పిలిచారు. మేమూ మాట్లాడటానికే వెళ్లాం. తమపై దాడి జరిగిందనే పదాన్ని వాడొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కోరారు.


  • విధులు బహిష్కరించిన ఉద్యోగులు

లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో పాటు రెవెన్యూ అధికారులపై అక్కడి రైతులు దాడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తాండూరు తహసీల్దార్‌ కార్యాలయ ఇబ్బంది పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు విధులు బషిష్కరించి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కే రక్షణ లేకుండా ఉంటే కింది స్థాయి సిబ్బంది పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పూడూరు తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి సిబ్బంది నిరసన తెలిపారు. మోమిన్‌పేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సిబ్బంది నిరసన తెలిపారు. యాలాల తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి.. నినాదాలు చేశారు. పరిగి తహసీల్దార్‌ కార్యాలయంలో ఉద్యోగులు విధులు బహిష్కరించారు. కలెక్టర్‌, రెవెన్యూ అధికారులపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కోన్నారు.


  • దాడి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా

లగచర్లలో అధికారులపై జరిగిన దాడి సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. జరిగిన ఘటన గురించి సమగ్ర సమాచారం తెప్పించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ... దాడి వెనక ఉన్నవారిని వదిలి పెట్టకూడదని ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులపై దాడి జరగవచ్చన్న సమాచారం అప్పటికే కొందరికి ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా, ఈ దాడిలో అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌కు చెందిన బంగారు గొలుసు చోరీకి గురికావడం గమనార్హం.

Updated Date - Nov 12 , 2024 | 04:01 AM