Share News

R. Krishnaiah: జీవో 29పై సీఎం రేవంత్‌ది మొండి వైఖరి

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:40 AM

గ్రూప్‌-1 పరీక్షల వాయిదా, జీవో-29పై సీఎం రేవంత్‌రెడ్డి మొండి వైఖరి అవలంబిస్తున్నారని మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు.

R. Krishnaiah: జీవో 29పై సీఎం రేవంత్‌ది మొండి వైఖరి

  • గ్రూప్‌-1 మెయిన్స్‌ను వాయిదా వేయకపోతే రాష్ట్రాన్ని దిగ్బంధిస్తాం: మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

బర్కత్‌ఫుర, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 పరీక్షల వాయిదా, జీవో-29పై సీఎం రేవంత్‌రెడ్డి మొండి వైఖరి అవలంబిస్తున్నారని మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. జీవో-29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు జరిగే నష్టంపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్‌ చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే గ్రూప్‌-1 మొయిన్స్‌ను వాయిదా వేయకపోతే రాష్ట్రాన్ని దిగ్బంధిస్తామని ఆయన హెచ్చరించారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థులు, యువజన సంఘాల సదస్సుకు ఆయన హాజరయ్యారు.


ఓపెన్‌ కాంపిటేషన్‌లో లాస్ట్‌ కటాఫ్‌ ముగిసిన తర్వాతనే రిజర్వేషన్‌ ఉద్యోగాలను లెక్కించాలని డిమాండ్‌ చేశారు. మెరిట్‌లో వచ్చిన అభ్యర్థులను రిజర్వేషన్ల కింద లెక్కించి అన్యాయం చేయవద్దన్నారు. జీవో-29పై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కృష్ణయ్య చెప్పారు. జీవో-55 రాజ్యాంగబద్ధమైనదని, దానిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు వేముల రామకృష్ణ, రాంకోటి ముదిరాజ్‌, సి.రాజేందర్‌, ఉదయ్‌నేత, రాందేవ్‌ మోదీ, నందగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 03:40 AM